విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నాని అహంకారంతో గొడవపడి అందరినీ దూరం చేసుకున్నారని ఆయన సోదరుడు కేశినేని చిన్ని (శివనాథ్) అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను మాత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. తన సోదరుడు తనపై చాలా సార్లు విమర్శలు చేశారని, అయినా తాను ఎప్పుడూ స్పందించలేదని అన్నారు. తన భార్యపై ఒక స్టిక్కర్ చేసి పెట్టారని, ఒక ఎంపీగా ఆయన ఇలాంటి పనులు చేయవచ్చా అని చిన్ని ప్రశ్నించారు. చాలా సార్లు మీడియాతో రకరకాలుగా తనను, తన కుటుంబాన్ని అవమానిస్తూ మాట్లాడారని.. అయినా తాను ఏ రోజూ మాట్లాడలేదని కేశినేని చిన్ని పేర్కొన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేతున్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఆ పార్టీ సీటు ఇస్తే విజయవాడ ఎంపీగా గెలచితీరుతానని అంటున్నారు.. అలాగే టీడీపీ తరఫున మీకు సీటు ఇస్తే అన్నాదమ్ములు ఇద్దరూ పోటీ పడతారా.. అన్న ప్రశ్నకు సమాధానంగా చిన్ని మాట్లాడుతూ.. తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు ఒక కార్యకర్తను నిలబెట్టినా లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేశినేని నాని, జగన్.. ఎవరన్నా కానీ.. ఇక్కడ ఏడు నియోజకవర్గాలను టీడీపీ కైవశం చేసుకుంటుందన్నారు.
ఎంపీ కేశినేని నాని ఎన్ని అంటున్నా 1990 నుంచి తానే సర్దుకుపోతూ వచ్చానని తెలిపారు. తమ కుటుంబంలో ఎప్పటినుంచో కలహాలు ఉన్నాయని.. వాటితో తెదేపాకు, అధినేత చంద్రబాబుకు సంబంధమేంటని ప్రశ్నించారు. మా కుటుంబంలో దశాబ్దాలుగా సమస్యలు ఉన్నాయి. ఎంపీ టికెట్ ఇచ్చి రెండుసార్లు ఆదరించిన నందమూరి, నారా కుటుంబాలను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదు. అమరావతిని సర్వనాశనం చేసిన జగన్ చెంతకు ఆయన చేరడాన్ని విజయవాడ ప్రజలు హర్షించరు. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షను మరచి మాట్లాడటం తగదు.
‘యువగళం’ పాదయాత్రలో నారా లోకేశ్ వెంట లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు నడిచారు. విజయవాడకు. హెచ్సీఎల్ సహా ఎన్నో సంస్థలు వచ్చాయంటే దానికి లోకషే కారణం. ఎంతోమంది మహామహులు వీడినా తెదేపాకు ఏమీ కాలేదు. వచ్చేవాళ్లు వస్తుంటారు.. పోయేవాళ్ళు పోతుంటారని కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు.