టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బేడ, బుడగ జంగాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం కడిమెట్ల మహాలక్ష్మి కాటన్ మిల్లువద్ద బుడగ జంగాల సామాజకవర్గ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. బేడ, బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై జెసి శర్మ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆమోదించి, కేంద్రానికి పంపేలా ప్రభుత్వంపై వత్తిడి తేవాలి.
శర్మ కమిషన్ ఇచ్చిన నివేదికపై కొన్ని కొన్ని సూచనలు చేస్తూ కేంద్రం ప్రస్తుత ప్రభుత్వానికి లేఖరాసింది. కాలయాపన చేయకుండా కేంద్రం అడిగిన వివరాలను తక్షణమే పంపేలా ప్రభుత్వంపై వత్తిడి తేవాలి. సంచార జాతులమైన బేడ, బుడగ జంగాలకు న్యాయం చేయాలి. మా జీవితాలకు ఉరితాడుగా ఉన్న 2008నాటి జిఓ 144ను రద్దుచేసి, దాని స్థానంలో కొత్త జిఓ ఇచ్చి మాకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. కులాల మధ్య గొడవలు పెట్టి తమాషా చూడటం వైసిపి ప్రభుత్వానికి అలవాటుగా మారింది. బేడ, బుడగ జంగాల సమస్యపై చట్టసభల్లో వత్తిడి తెస్తాం, వెంటనే పరిష్కరించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వానికి లేఖరాస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.