టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తపెట్ల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఉమ్మడి కడప జిల్లాలో ఇసుక అక్రమాలు పెరిగిపోయాయి. జిల్లాలో 11 క్వారీలకు అనుమతులుంటే, రెట్టింపు క్వారీల్లో అనధికారికంగా ఇసుక తవ్వుతున్నారు. జెపి వెంచర్స్ పేరుతో రాత్రింబవళ్లు నిబంధనలకు విరుద్దంగా ఇసుక తవ్వుతున్నారు. భూగర్భజలాలు మరింత ఇంకిపోయేలా లోతుగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. దొంగ వేబిల్లులతో ఇసుక తోలుతూ సీనరేజీ ఆదాయానికి గండికొడుతున్నారు. తపెట్ల గ్రామంలోని రోడ్లు ఇసుక రవాణా వాహనాల వల్ల పాడైపోయాయి. జిల్లా వ్యాప్తంగా నెలకు సుమారు రూ.50కోట్లు దోచుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి సొంత బంధువులు బినామీ పేర్లతో దోచుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక అక్రమ ఇసుక తవ్వకందారులపై చర్యలు తీసుకోవాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ఇసుక మాఫియా ధనదాహం కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 61మంది అమాయకులు బలయ్యారు, వారికి ఇంతవరకు ఎటువంటి పరిహారం అందజేయలేదు.
జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే బినామీ సంస్థను అడ్డుపెట్టుకొని అడ్డగోలు దోపిడీపర్వానికి తెరలేపారు. గత నాలుగేళ్లుగా ఇసుక ద్వారా జగన్ అండ్ కో రూ.10వేల కోట్లు దోచుకున్నారు. స్థానిక నదుల నుంచి ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నదీజలాలను పరిరక్షిస్తూ ఇసుక విధానాన్ని సరళీకరించి స్థానికులకు అందుబాటులోకి తెస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.