యువగళంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అడుగడుగునా వైసిపి ఎమ్మెల్యే, ఆ పార్టీనేతల అక్రమాల చిట్టా విప్పుతుండటంతో వైసిపి నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించిన యువనేత ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరులు చేసిన అవినీతిని ఆధారాలతో సహ బయటపెట్టారు. తోపుదుర్తి అవినీతి ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో తమవద్ద డబ్బులు లేవని, రాజకీయం కోసం ఇల్లు అమ్ముకుంటున్నానని నటించిన తోపుదుర్తి ఈ నాలుగేళ్లలో రూ. 1,000 కోట్ల అక్రమార్జన చేశారు. పాలడైరీ పేరిట పేద ఆడవాళ్ళ రక్తం పీల్చి వాళ్ళ కష్టార్జితం ఒక్కొక్కరి నుంచి రూ.10వేల చొప్పున 10 కోట్లు వసూలు చేసి, ఆ డబ్బులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాప్తాడు మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో అప్పటి మంత్రి పరిటాల సునీతమ్మ జాకీ పరిశ్రమను రప్పించి, 6వేలమంది మహిళలకు ఉద్యోగాలిచ్చేలా ఒప్పందం కుదుర్చకున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే తోపుదుర్తి రూ.15కోట్ల కమీషన్ డిమాండ్ చేయడంతో జాకీ పరిశ్రమ తెలంగాణా తరలిపోయింది. దీంతో జాకీ పరిశ్రమకు భూములిచ్చిన రైతులతోపాటు వేలాది మహిళల ఉసురు పోసుకున్నారు ఎమ్మెల్యే తోపుదుర్తి.
నియోజకవర్గ పరిధిలో ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి లే అవుట్ వేయాలన్నా వ్యాపారుల నుంచి ఎకరాకు రూ.10లక్షలు వసూలు చేస్తున్నారు. కరోనా తర్వాత వ్యాపారాలు లేక కొంతమంది అప్పుల పాలవగా, మరికొంతమంది కప్పం కట్టలేక ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. రాప్తాడు ప్రాంతంలో మట్టి, కంకర, ఇసుక ఏది కావాలన్నా తోపుదుర్తి సోదరులకు కప్పం కట్టాల్సిందే. చివరకు వాటి రవాణాకు వారి టిప్పర్లనే కిరాయికి తీసుకోవాలి. తాము దోచుకున్న పాపపు సొమ్ముతో అనంతపురం శ్రీకంఠం సర్కిల్లో రూ. 70 కోట్ల విలువ చేసే భవనాన్ని తోపుదుర్తి తాజాగా కొనుగోలు చేశారు. గోవిందంపల్లి రింగ్ రోడ్డు దగ్గర పేద బ్రాహ్మణులను బెదిరించి తోపుదుర్తి సోదరుడు రాజారెడ్డి 50 కోట్ల విలువ చేసే ఆస్తిని కబ్జాచేశాడు. ఎమ్మెల్యే మరో సోదరుడు తోపుదుర్తి చందు హైదరాబాదులో 15 కోట్ల విలువ చేసే ఇంద్ర భవనం లాంటి భవంతి నిర్మించారు.
ఒకప్పుడు కారు డీజిల్ కు కూడా డబ్బులు లేలది చెప్పిన ఎమ్మెల్యే తోపుదుర్తి ఈరోజు అనంతపురం నుంచి రాప్తాడు వెళ్లి వచ్చినంత ఈజీగా విలాసవంతమైన విమానాల్లో హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, గోవా, ఢిల్లీ, బాంబే, చెన్నై నగరాలకు షికార్లు చేస్తూ జల్సాలు చేస్తున్నారు. చిక్బల్లాపూర్ సమీపంలోని ఈషా ఫౌండేషన్ దగ్గర ఇటీవల 60 ఎకరాల కొబ్బరి తోటను ఎమ్మెల్యే తోపుదుర్తి కొనుగోలు చేశారు. ముంబైలో రూ.80 కోట్లతో అంధేరీ ప్రాంతంలో విలాసవంతమైన కమర్షియల్ బిల్డింగ్ కొనుగోలు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉమ్మడి అనంతపురం జిల్లాను తోపుదుర్తి సోదరులు బందిపోట్ల మాదిరి దోచుకుంటున్నారు. తోపుదుర్తి సోదరుల అవినీతిని ప్రశ్నించిన సొంతపార్టీ నేతలను కూడా ఎమ్మెల్యే వేధింపులకు గురిచేస్తున్నారు. పేదల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్ట్ ను తీసుకున్న తోపుదుర్తి వారి కంపెనీ రాక్రీట్ ఒక్కొక్క లబ్దిదారుడి పునాదికి 75 వేల చొప్పున రూ.280కోట్లు దోచుకుంది. ఎమ్మెల్యే తోపుదుర్తి బెంగళూరు యలహంక లో రూ. 33 కోట్లతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించారు. వైజాగ్ సీతమ్మధారలోని కమర్షియల్ భవనం కొనుగోలుచేశారు. కొంతమంది పోలీసు అధికారులను తన పాపాల్లో భాగస్వాములుగా చేసుకుని బెదిరింపులు, పంచాయతీలు చేస్తూ నాలుగేళ్లలో వందల కోట్ల ఆస్తులు పోగేసుకున్నారు. రాప్తాడు నియోజకవర్గాన్ని తోపుదుర్తి సోదరులు కేకుముక్కల్లా పంచుకుని పీల్చి పిప్పి చేస్తున్న విషయాన్ని ఇటీవల నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన లోకేష్ ఆధారాలతో సహా బయటపెట్టడంతో నియోజకవర్గంలో కలకలం చెలరేగింది.