మహిళల వంక కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తాం
నా తల్లికి జరిగిన అవమానం మరో చెల్లికి జరగనీయను!
నిర్భయ చట్టాన్ని కఠినంగా అమలుచేసి రక్షణ కల్పిస్తాం
తల్లీ, చెల్లికి న్యాయం చేయలేని వాడు మహిళలకేం చేస్తాడు?
అధికారంలోకి వచ్చిన తొలిఏడాదే మహిళలకు మహాశక్తి
పేదరికం లేని రాష్ట్రంగా ఎపిని తీర్చిదిద్దడమే టిడిపి లక్ష్యం
“మహాశక్తితో లోకేష్” కార్యక్రమంలో యువనేత లోకేష్
2024లో ఎన్నికల ఫలితాల్లో టిడిపి లీడింగ్ లో ఉందన్న వార్తలు వెలువడే సమయంలోనే రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు ఆగిపోతాయని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో “మహాశక్తితో లోకేష్” పేరుతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమై మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకు న్నారు. ఈ కార్యక్రమానికి కడపకు చెందిన 10రూపాయల డాక్టర్ నూరిఫర్వీన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మినహా ఎప్పుడూ ఇంటి నుంచి బయటకు రాని నా తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించారు, ఎపి చరిత్రలో తొలిసారిగా రాజకీయాలు ఇంతలా దిగజారి పోయాయి. నెల రోజుల పాటు అమ్మ మానసిక క్షోభ అనుభవించింది, ఇప్పటికీ వైసిపి నాయకులు అవమానిస్తూనే ఉన్నారు, అధికారంలోకి వచ్చాక నా తల్లికి జరిగిన అవమానం మరో చెల్లికి జరగనీయను, మహిళలను అవమానించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం.
నిర్భయ చట్టాన్ని అమలు చేయడం ద్వారా పటిష్టమైన రక్షణ కల్పిస్తాం. సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మహిళలకేం న్యాయం చేస్తాడు? 145రోజుల సుదీర్ఘ పాదయాత్రలో మహిళల కష్టాలు తెలుసుకున్నాకే మహాశక్తి కార్యక్రమాన్ని మహానాడు సాక్షిగా చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తొలిఏడాదిలోనే ఈ కార్యక్రమాన్ని అమలుచేసి తీరుతాం. అప్పులు చేయడం ద్వారా కాకుండా అభివృద్ధి ద్వారానే సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయాలన్నది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. పేదరికం లేని రాష్ట్రంగా ఎపిని తీర్చిదిద్దడమే టిడిపి లక్ష్యం. మహిళలను గౌరవించాలన్న ఆలోచన మనసులో రావాలి. ఇందుకోసం కెజి నుంచి పిజి వరకు మహిళలను గౌరవించాలనే ప్రత్యేక పాఠ్యాంశాలు తెచ్చి, సామాజిక చైతన్యం తెచ్చే బాధ్యత తీసుకుంటాం.
చట్టసభల్లోకి విద్యావంతులను ఎన్నుకోవడం ద్వారా చాలావరకు సమస్యలు పరిష్కారం అవుతాయి, అందుకే తెలుగుదేశం పార్టీ విద్యావంతులు, ఇంజనీర్లు, డాక్టర్లు, పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించింది. అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నియంత్రించి, సామాజిక చైతన్యం కల్పిస్తాం. అంగన్ వాడీలకు జీతాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తాం. పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని పునరుద్దరించి పీజీ విద్యార్థులకు కూడా వర్తింపజేస్తాం. రాష్ట్రంలో వివిధ కళాశాలల్లో ఫీజు బకాయిల కారణంగా నిలచిపోయిన సర్టిఫికెట్లను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా విద్యార్థులకు అందజేస్తాం. అభివృద్ధి, సంక్షేమాలను జోడెడ్ల బండిలా కొనసాగించి, ప్రపంచంలోనే రాష్ట్రాన్ని నెం.1 గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తాం.