ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువొక్కటే – నెల్సన్ మండేలా
జాతివివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు నెల్సన్ మండేలా చెప్పినట్టు సామాజిక మార్పుకు విద్య ప్రధాన సాధనం. దేశప్రగతికి బాటలు వేసిన నిన్నటితరం నాయకులందరూ ఉన్నత విద్యావంతులే. వర్తమాన రాజకీయ వాతావరణంలో ఆ తరహా విద్యావంతుల అవసరం ఎంతైనా వుంది. ప్రస్తుత రాజకీయ యవనికపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ జాబితాలో ముందువరుసలో వున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందిన అమెరికా లోని స్టాన్ ఫోర్డ్ లో లోకేష్ ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఏ పరిశోధన అయినా ఆ విశ్వవిద్యాలయంలోనే పురుడు పోసుకుంటుంది. అంతటి ఉన్నతమైన విశ్వవిద్యాలయంలో చదివిన లోకేష్, విలాసవంతమైన జీవితాన్ని కాదనుకుని ప్రజాసేవా రంగాన్ని ఎంచుకోవటం తెలుగుజాతికి గర్వకారణం.
తెలుగుజాతి భవిష్యత్ మహోజ్వలం చేసే దిశగా పదిహేనేళ్ల ప్రణాళిక రూపొందిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు లోకేష్ వంటి ఉన్నత విద్యనభ్యసించి నవతరం ప్రతినిధులు బాసటగా నిలవాల్సిన అవసరం ఎంతైనా వుంది. చంద్రబాబు మేధస్సుకు విద్యావంతుల ఆలోచనలు తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు. రాజకీయపు రంగుటద్దాలలో చూసేవారికి లోకేష్ కేవలం ఎన్టీఆర్, చంద్రబాబుల వారసునిగానే కనిపించవచ్చు. అయితే విశాల దృక్పథంతో పరికిస్తే లోకేష్ లోనూ భవిష్యత్ దార్శనికుడు కనిపిస్తాడు. ఈ విషయాన్ని లోకేష్ ఇప్పటికే నిరూపించుకున్నారు. ప్రజాస్వామ్యం లో అధికారం చేపట్టేందుకు ఎన్నికలలో గెలుపే ప్రాతిపదిక. అయితే అధికారం చేపట్టిన వారికి విద్య, వివేకం లోపిస్తే ఎంతటి విధ్వంసం చోటుచేసుకుంటుందో, ప్రజలు ఎన్ని అవస్థలు పడతారో వర్తమానంలో పలు సంఘటనలు కళ్లముందే సాక్షాత్కరిస్తున్నాయి.
తాత ఎన్టీఆర్ లోని పట్టుదల, క్రమశిక్షణ, తండ్రి చంద్రబాబు నుంచి అలవర్చుకున్న వ్యూహ చతురత, అభివృద్ధి కాంక్ష లకు, కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సంస్కారం లకు, లోకేష్ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థ నుంచి సమకూర్చుకున్న జ్ఞానం ను జోడించి భావి ఆశాజ్యోతిగా, నవతరం ప్రతినిధిగా ఆవిష్కృతం అయ్యారు. విద్య, వినయం, సంస్కారం మూర్తీభవించిన వారు అరుదు. అందులోనూ రాజకీయ రంగంలో అటువంటివారు వుంటే అంతకంటే కావలసిందేమున్నది. లోకేష్ సరిగ్గా అదే కోవకు చెందుతారు.
2014 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. తర్వాత కొద్దికాలానికే లోకేష్ అమాత్య పదవి చేపట్టారు. మంత్రిగా లోకేష్ అరుదైన ఘనత సాధించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజ్ రహదారులు నిర్మించారు. ఒక వైపు పార్టీలోనూ, మరోవైపు పాలనలోనూ తనదైన శైలి లో ముద్ర కనబర్చసాగారు. మంత్రి పదవి చేపట్టిన వెంటనే శాసనమండలి లో సభ్యునిగా ఎన్నికయ్యారు. శాసనమండలి లో అధికార పార్టీ లోకేష్ లక్ష్యంగా చేసుకొని దాడి చేసినప్పుడు, ఏమాత్రం బెదరకుండా, సమర్థంగా తిప్పికొట్టారు. మండలిలో లోకేష్ లేవనెత్తిన అంశాలు, చేసిన ప్రసంగాలు, భావి భారతావని పురోభివృద్ధి కాముకులలో ఆశలు రేకెత్తించాయి. ఏమాత్రం ఆవేషకావేశాలకు లోనుకాకుండా పరిణితితో ఎంతో హుందాగా వ్యవహరించారు.
ప్రత్యర్థి పార్టీల విమర్శలను సైతం లోకేష్ సమర్థంగా తిప్పికొడతారు. విమర్శల్లో వాడి, వేడి కనబరుస్తూనే సుతిమెత్తగా చురకలు అంటించటం లోకేష్ ప్రత్యేకత. ఒక సందర్భంలో రాష్ట్ర మంత్రి ఒకరు లోకేష్ కు చీరలు, గాజులు పంపిస్తామంటూ ఎద్దేవ చేశారు. ఒక మహిళ అయి వుండి ఆ మంత్రి మహిళలను అందర్నీ కించపరిచేలా మాట్లాడటాన్ని లోకేష్ సహించలేక పోయారు. ఆ మహిళా మంత్రి పంపించే చీర, గాజులు ను తాను ఆనందంగా స్వీకరిస్తానని, వాటిని తన తల్లికి లేదా రాష్ట్రవ్యాప్తంగా వున్న అక్కచెల్లెళ్లు కు అందజేస్తానని సుతిమెత్తగా చురకలంటించారు. లోకేష్ లో పరిమితికి, హుందాతనానికి ఇటువంటి సంఘటనలే నిదర్శనం. ఇదంతా లోకేష్ స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం లో అలవర్చుకున్న అత్యుత్తమ వ్యక్తిత్వం అని చెప్పవచ్చు.