టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వలసల నివారణ కు అన్ని చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం ఎమ్మిగనూరు శివారు సబ్ స్టేషన్ ప్రాంతంలో వలస కూలీలతో లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. గుంటూరు జిల్లా వెళ్లి మిర్చి పనులు చేసుకొని తిరిగి వస్తున్నాం.
సాగునీరు లేక స్థానికంగా వ్యవసాయ పనులు దొరకడం లేదు.
అందుకే ఇతర ప్రాంతాలకు పిల్లలతో సహా వెళ్లి పనులు చేసుకొని తిరిగి సొంత ఊళ్లకు వస్తున్నాం.
గుంటూరు వెళ్లి పనిచేస్తే రోజుకిరూ.350 కూలీ వస్తుంది. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో బ్రతకడం కష్టంగా మారింది.
మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సాగునీరు అందించాలి. స్థానికంగా పనులు దొరికేలా చెయ్యాలి.
వలస కష్టాలు లేకుండా చూడాలి అని కోరారు.
వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాయలసీమ బిడ్డ అని ప్రచారం చేసుకున్న జగన్ రాయలసీమ కి తీరని అన్యాయం చేశారు.
వలస కూలీల కష్టాలు జగన్ కి కనపడటం లేదా?
వేలాది మంది ఊర్లు ఖాళీ చేస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది.
రాయలసీమ ప్రాజెక్టుల పట్ల జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
టిడిపి హయాంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం 11,700 కోట్లు ఖర్చు చేస్తే జగన్ ప్రభుత్వం అందులో 10 శాతం కూడా ఖర్చు చెయ్యలేదు.
రాయలసీమ కి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి రత్నాల సీమ గా మార్చాలని టిడిపి హయాంలో ప్రయత్నించాం.
జగన్ రాయలసీమ ను మళ్ళీ రాళ్ల సీమ గా మారుస్తున్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం.
సబ్సిడీ లో డ్రిప్ అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం.
స్థానికంగా వ్యవసాయ పనులు దొరికేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.