పాలకుడే 420 అయితే సామాన్యులకు న్యాయం సాధ్యమా?
సైకోపాలనలో అన్నివర్గాల ప్రజల్లో భయాందోళనలు
టిడిపి ఆవిర్భావంతోనే బిసిలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం
దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్
అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో బిసి రక్షణ చట్టం తెస్తాం
దామాషా పద్ధతిన ఉపకులాలకు నిధులు కేటాయిస్తాం
ఒక్క బటన్ తో బిసిల శాశ్వత కులధృవీకరణ పత్రాలు ఇస్తాం
బిసిలకు న్యాయం చేసిన, చేయబోయే చరిత్ర కూడా టిడిపిదే
పేదరికం లేని రాష్ట్రం కోసం కులవృత్తులను ప్రోత్సహిస్తాం
ఒంగోలు జయహో బిసి సదస్సులో యువనేత నారా లోకేష్
చట్టాలను అమలుచేసే పాలకుడే 420, ఆర్థిక నేరగాడైతే సమాజంలో సామాన్యులకు ఎలా న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ యువనేత, యువగళం రథసారధి నారా లోకేష్ ప్రశ్నించారు. ఒంగోలు శివారు రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట నిర్వహించిన జయహో బిసి సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున బిసిలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ ఉదయభాను సంధానకర్తగా వ్యవహరించారు. యువనేత లోకేష్ మాట్లాడుతూ… ఎవరికి అన్యాయం జరిగినా గన్ కన్నా ముందొస్తానన్నజగన్ పాలనలో స్టేషన్ కెళ్లి కేసుపెట్టినా దిక్కులేని పరిస్థితి నెలకొనడం బాధాకరం. సైకో పాలనలో సమాజం మొత్తం భయాందోళనలతో బతుకోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో బిసిల రక్షణ చట్టాన్ని అమల్లోకి తెస్తాం.
అధికార మదంతో బిసిలను వేధించిన కామాంధులను రోడ్లపై వెంటాడి కటకటాల్లో పెడతాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బిసిలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం లభించింది. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది స్వర్గీయ నందమూరి తారకరామారావు. బిసిలకు దామాషా పద్ధతిన నిధులు కేటాయించి, కార్పొరేషన్లను బలోపేతం చేస్తాం. వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన ఆదరణ పథకాన్ని పునరుద్దరించి, బిసిలకు పనిముట్లు అందజేస్తాం. విదేశీవిద్య పథకంతో బిసిబిడ్డలకు ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశం కల్పిస్తాం. పెద్దఎత్తున పరిశ్రమలు తెచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. కులధృవీకరణ పత్రాల కోసం తరచూ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సెల్ ఫోన్ ద్వారా ఒక్క బటన్ తో బిసిలకు శాశ్వత కులధృవీకరణ పత్రాలు అందేలా చర్యలు తీసుకుంటాం. పేదరికం లేని రాష్ట్రం కోసం కులవృత్తులను ప్రోత్సహించి, వారి ఆర్థిక స్వావలంబనకు చేయూతనిస్తాం.
జయహో బిసి సదస్సులో అడిగిన ప్రశ్నలు – యువనేత లోకేష్ సమాధానాలు:
యాంకర్: 167రోజులుగా పాదయాత్ర నిర్విరామంగా చేస్తున్నారు. మీకు అలసట రావడం లేదా? మండుటెండలు, వర్షాలను సైతం లెక్కచేయకుండా 2,200కిలోమీటర్లు ఎలా నడిచారు? ఎందుకు నడుస్తున్నారు?
లోకేష్: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు యువగళం చేపట్టాను. ఈ సుదీర్ఘ పాదయాత్రలో అట్టడుగు స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను నేరుగా చూడగలిగాను. పాదయాత్రలో ప్రజల స్పందన బాగుంది. కార్యకర్తలు, నాయకులు బ్రహ్మరథం పడుతున్నారు.రేపటికి 2,200కిలోమీటర్ల మైలురాయి దాటబోతున్నాను. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నా ప్రయాణం ఆగదు. ఇచ్ఛాపురం చేరుకునేవరకు విశ్రమించేది లేదు.
యాంకర్: జయహో బీసీ ఎందుకు పెట్టారు?
లోకేష్: బీసీల పట్ల మా చిత్తశుద్ధిని గతంలో అనేక కార్యక్రమాల ద్వారా మేం చేసి చూపించాం. ఎన్టీఆర్ సీఎం అయ్యాక పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. బీసీలను మంత్రులు, ఎంపీలు, స్పీకర్లను చేశారు. 24శాతం స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే చంద్రబాబు దీన్ని 34శాతానికి పెంచారు. బీసీ సబ్ ప్లాన్ పెట్టి, నిధులు కేటాయించి కేవలం బీసీలకే చంద్రబాబు ఖర్చు పెట్టారు. పాదయాత్రలో బీసీల సమస్యలను ప్రతి ఒక్కటీ తెలుసుకుంటున్నాను. మరిన్ని సమస్యలు తెలుసుకునేందుకు జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
విజయగౌరి యాదవ్, నంద్యాల: టీడీపీ పాలనలో బీసీ విద్యార్థులకు విదేశీవిద్య పథకాన్ని ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. బీసీలు విదేశాల్లో చదువుకు నోచుకోలేక అట్టడుగు స్థాయికి పడిపోతున్నాం. మీరు అధికారంలోకి వస్తే విదేశీవిద్య పథకాన్ని తెస్తారా?
లోకేష్: బీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన చరిత్ర మాదే..రానున్న కాలంలో మరిన్ని చేసి చరిత్ర సృష్టించేది మేమే. టీడీపీ పాలనలో బడుగు,బలహీనవర్గాలను విదేశాలకు పంపాలని సంకల్పించింది తెలుగుదేశం పార్టీ. దీనిలో భాగంగానే చంద్రబాబు విదేశీవిద్య పథకాన్ని తెచ్చి అమలు చేశారు. అనేక మంది ఈ పథకంలో భాగంగా విదేశాలకు వెళ్లి చదువుకుని స్థిరపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసి బడుగు, బలహీన వర్గాలకు ద్రోహం చేశారు. టీడీపీ పాలనలో విదేశీవిద్యకు వెళ్లిన వారికి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత విదేశాల్లో ఉన్న వారికి వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేదు. మేం అధికారంలోకి వచ్చాక విదేశీవిద్య పథకాన్ని కొనసాగిస్తాం. అవసరమైన ఏర్పాట్లు మేం చేస్తాం.
షేక్ అజిమున్, ఒంగోలు: బీసీ మహిళలపై వైసీపీ ప్రభుత్వం అనేక అరాచకాలకు పాల్పడుతోంది. మాకు ఎస్సీ, ఎస్టీ తరహా చట్టం తెస్తారా? మాకు రక్షణ కల్పిస్తారా? ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం నాపై అక్రమంగా 14 కేసులు పెట్టారు.
లోకేష్: వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. నాపై ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసులు పెట్టారు. బీసీలకు రక్షణ చట్టాన్ని మేం అధికారంలోకి వచ్చిన మొదటి సంత్సరంలోనే తెస్తాం. న్యాయపోరాటానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించే అంశాన్ని ఈ చట్టంలో భాగంగా రూపొందిస్తాం.
హేమశ్రీ, అమర్నాథ్ గౌడ్ అక్క, రేపల్లె, బాపట్ల జిల్లా: నన్నుఏడాదిన్నర నుండి వైసీపీ కార్యకర్తలు ఏడిపిస్తున్నారు. నా తమ్ముడు ప్రశ్నించినందుకు పెట్రోల్ పోసి తగులబెట్టేశారు. ఆత్మహత్య చేసుకున్నాడని సృష్టించారు. కేసు కూడా సరిగా నమోదు చేయలేదు. టీడీపీ నాయకులు పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బీసీలు ఏమీ చేయలేరు, ప్రశ్నించలేరని తక్కువ అంచనా వేస్తున్నారు. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ నాకు అండగా నిలచింది.
లోకేష్: వైసీపీ ప్రభుత్వంలో చట్టాలు అధికారపార్టీ చుట్టాల్లా మారాయి. దీనివల్ల అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరుగుతోంది. అక్కని ఏడిపిస్తే స్పందించిన తమ్ముడిని కిరాతకంగా చంపి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది వైసీపీ ప్రభుత్వం. వైసీపీ సోషల్ మీడియాలో అమర్నాథ్ గౌడ్ ది ఆత్మహత్య అంటూ ఫేక్ పోస్టులు ప్రచారం చేస్తున్నారు. మీ ఇళ్లల్లో మీ ఆడబిడ్డలకు ఇలాగే జరిగితే ఇలాగే చేస్తారా? అమర్నాథ్ గౌడ్ విలవిల్లాడుతూ చనిపోతే కనీసం ముఖ్యమంత్రికి కనీసం కనికరం కలుగలేదు. వైసీపీ ప్రభుత్వం ఈ కేసులో కఠినంగా వ్యవహరించి ఉంటే మరో చెల్లెమ్మకు అన్యాయం జరగదు. అధికారంలోకి రాకముందు గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పి, నేటికీ ఈ చెల్లెమ్మ వద్దకు రాలేదు? మంత్రి జోకర్ జోగి బాధిత కుటుంబం వద్దకు వెళ్లి బేరసారాలు ఆడి అవమానించారు.ఈ బాధిత కుటుంబాన్ని చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. నా తల్లి భువనేశ్వరి ఈ చెల్లిని ఎన్టీఆర్ ట్రస్టులో చదివిస్తున్నారు. ఇది బిసీల పట్ల మాకున్న చిత్తశుద్ధి. నాకు చెల్లిలేని లోటు తెలుసు. ఇలాంటి మరో చెల్లికి, అక్కకి జరగకుండా చూసే బాధ్యతను ఈ లోకేష్ తీసుకుంటాడు. 9నెలలు తర్వాత అమర్నాథ్ గౌడ్ హత్య వెనుక ఎంతటి వాడు ఉన్నాసరే తీసుకొచ్చి జైల్లో పడేస్తాం. వైసీపీ రౌడీ మూకలకు నువ్వు ఎదిగి మీరు వెనుకబడిన వాళ్లు కాదు..మీకు తెలుగుదేశంపార్టీ కుటుంబం అన్ని విధాలా అండగా ఉంటుంది.
యాంకర్: కులవృత్తులు టెక్నాలజీతో పోటీపడేలా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? గాండ్ల సామాజికవర్గ ప్రజలు తయారుచేసే నూనెను ప్రభుత్వం కొనేలా చర్యలు తీసుకుంటారా?
లోకేష్: మా మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలు ఉన్నారు. వారికి టీడీపీ పాలనలో అనేక సబ్సిడీ పథకాలు ఇచ్చి ఆదుకున్నాం. చేనేతల ఉత్పత్తులను టాటా కంపెనీ కొనుగోలు చేసేలా ఓ వేదిక ఏర్పాటు చేశాం.చేనేతలకు పెట్టుబడి ఖర్చులు తగ్గించి, లాభాలు వచ్చేలా చర్యలు తీసుకున్నాం. మెరుగైన టెక్నాలజీతో కులవృత్తులు అనుసంధానం కావాలి, మార్కెటింగ్ ఏర్పాటు చేయాలి. దీనికి ఓ ప్లాట్ ఫాం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. ముఖ్యంగా కులవృత్తుల వారి పెట్టుబడులు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కులవృత్తుల వారికి సబ్సిడీలు ఇచ్చే చర్యలు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. పేదరికంలేని రాష్ట్రాన్ని నిర్మించడానికి మేం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.
ఆడియన్స్: బీసీ చట్టం తీసుకురావాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? మీరు అధికారంలోకి వచ్చాక చేయడం సాధ్యమేనా?
లోకేష్: చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆదరణ పథకం ద్వారా వాషింగ్ మెషీన్లు రజకులకు ఇచ్చాం. కానీ ఆ సమయంలో కరెంటు బిల్లు అధికంగా వస్తోందని వాళ్లు మెషీన్లు వాడుకోలేదు. ఈ విషయం మాకు ఆలస్యంగా తెలిసింది. మేం అధికారంలోకి వచ్చాక రజకులకు విద్యుత్ సబ్సిడీలు ఇస్తాం. గాండ్ల సామాజికవర్గానికి కూడా గానుగ మెషీన్లకు విద్యుత్ సబ్సిడీలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం నూనె కొనేలా చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తారు. నేను తప్పు చేసినా చంద్రబాబు ఉపేక్షించే పరిస్థితి ఉండదు. మేం అధికారంలోకి వచ్చిన తొలి యేడాదిలోనే బీసీ రక్షణ చట్టం తెస్తాం. అమలు చేసి చూపిస్తాం. పాదయాత్రలో నేను నడుస్తున్నప్పుడు బీసీలు వచ్చి తమకు జరిగిన అన్యాయాలు, దాడులు, అక్రమ కేసులు పై తమ సమస్యలను విన్నవిస్తున్నారు. బీసీలకు రక్షణ చట్టాన్ని ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ప్రకటించారు.
చంద్రశేఖర్, ఒంగోలు: బీసీలకు క్యాస్ట్ సర్టిఫికెట్లు మాకు పక్కాగా ఎలా ఇస్తారు? నేటికీ జనగణన జరగలేదు. ఎలా సాధ్యం? ఇది సాధ్యమేనా?
లోకేష్: బీసీలకు వైసీపీ నాయకులు సర్టిఫికెట్లు ఇవ్వడంలో జాప్యం చేస్తోంది. బీసీలు కానివారికి కూడా సర్టిఫికెట్లు తమ పార్టీ వాళ్లకు ఇస్తున్నారు. ఒక్క బటన్ నొక్కితే బీసీలకు సర్టిఫికెట్లు వచ్చేలా మేం చర్యలు తీసుకుంటాం. అమలు చేసి చూపిస్తాం. 2014లో బిసి జనగణనలో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది టిడిపి ప్రభుత్వం. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే బిసి జనగణన కోసం కేంద్రంతో పోరాడతాం.
యాంకర్: బీసీలకు సబ్సిడీ రుణాలు ఇప్పించే చర్యలు ఏమైనా చేపడతారా?
లోకేష్: టీడీపీ అధికారంలోకి వచ్చాక దామాషా ప్రకారం ఉపకులాల వారీగా నిధులు కేటాయిస్తాం, కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. కార్పొరేషన్లకు ఇచ్చే నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించం. కేవలం సబ్సిడీ రుణాల కోసం మాత్రమే కార్పొరేషన్ నిధులు ఇస్తాం. వైసీపీ పాలనలో బీసీ సంక్షేమశాఖ మంత్రి పేషీ ఉద్యోగులకు 6నెలలు పాటు జీతాలు రాక పేషీకి తాళం వేసిన దుస్థితి ఉంది. వైసీపీ పెట్టిన కార్పొరేషన్ డైరెక్టర్లకు, చైర్మన్లకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవు. గత నాలుగేళ్లలో బీసీ కార్పొరేషన్, ఉపకులాల కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ కూడా రాలేదు. కనీసం ఇస్త్రీ పెట్టె కూడా ఇవ్వలేదు.
కొఠారి నాగేశ్వర యాదవ్, ఒంగోలు: ఎన్టీఆర్ బీసీల కోసం పార్టీ స్థాపించారు. బీసీలు ఎన్టీఆర్ వెన్నంటి ఉన్నారు. బీసీలకు ఎన్టీఆర్ అనేక మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు. చంద్రబాబు పాలనలోనూ బీసీలకు మంత్రి పదవుల్లో అధికా ప్రాధాన్యతను ఇచ్చారు. 2024లో అధికారంలోకి వచ్చాక వారసత్వ నాయకులను కాకుండా కష్టపడే నాయకులను గుర్తిస్తారా?
లోకేష్: సాధికార సమితి ద్వారా ఉపకులాల వారీగా సంఘాలు ఏర్పాటు చేశాం. బీసీల్లోని చిన్న చిన్న కులాలకు చెందిన నాయకులను పైకి తీసుకురావడమే మా లక్ష్యం. పార్టీకి బాగా కష్టపడుతూ, ప్రజల మధ్య ఉన్నవారికి పెద్దపీట వేసే బాధ్యతను టీడీపీ తీసుకుంటుంది. సీనియర్, జూనియర్లను సమానంగా గౌరవిస్తా, పనిచేసేవారిని ప్రోత్సహిస్తా. రాష్ట్రం నేడు గాడితప్పంది. దాన్ని గాడిలో పెట్టేదానికి కష్టపడిన వారికి ప్రాధాన్యతనిచ్చే బాధ్యతను నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను.
రామాంజనేయులు, చంద్రయ్య కొడుకు, మాచర్ల: నా తండ్రి గొంతుపై కత్తిపెట్టి జై జగన్ అనాలని వైసీపీ వాళ్లు బలవంతం చేశారు. నా తండ్రి జై చంద్రబాబు అన్నాడని గొంతుకోసి రోడ్డుపై ప్రాణాలు విడిచాడు. మా కుటుంబానికి తెలుగుదేశంపార్టీ ఓ పెద్దదిక్కులా నిలబడింది. నన్ను, నా చెల్లిని చదివిస్తున్నారు. నా తండ్రికి జరిగిన అన్యాయం మరో కుటుంబానికి జరగకూడదు.
లోకేష్: తోట చంద్రయ్య పార్టీకోసం ప్రాణాలను పణంగా పెట్టాడు. జగన్ కులం డబ్బు…జగన్ మతం డబ్బు. సామాన్యుల ఆత్మాభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి డబ్బుతో కొనలేడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తోట చంద్రయ్య ఏం తప్పు చేశాడు? నమ్ముకున్న పార్టీ కోసం చిత్తశుద్ధితో నిలబడడమే తప్పా? వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను కులాలు, మతాలుగా విభజించి పాలిస్తోంది.. వేధిస్తోంది.. చంపుతోంది.. అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది. రాష్ట్ర ప్రజలంతా కులాలు, మతాలకు అతీతంగా ఏకమవ్వాలి. దుర్మార్గపు ప్రభుత్వానికి ధీటైన సమాధానం చెప్పాలని కోరుతున్నా. వైసీపీ అరాచకాలపై 5కోట్ల ఆంధ్రుల్లో చైతన్యం రావాలి. అందుకే నేను పాదయాత్ర చేస్తున్నాను. సైకో పోవాలి… సైకిల్ రావాలి… అనేది రాష్ట్రం నినాదం కావాలి. ఈ నినాదాన్ని రాష్ట్రమంతా అందిపుచ్చుకోవాలని కోరుతున్నా. వైసీపీ పాలనలో రెచ్చిపోయిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తాను.
బ్రహ్మంగౌడ్, కనిగిరి: పక్క రాష్ట్రంలో గౌడ కులానికి నీరా ప్రాజెక్టు, మద్యం దుకాణాల్లో 50శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు తెలంగాణ మాదిరి న్యాయం చేస్తారా?
లోకేష్: ఏపీలో ఏరులై పారుతున్న మద్యానికి కేరాఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్. ఈ ప్యాలెస్ వేదికగా కల్తీ మద్యం తయారవుతోంది. అధికారంలోకి రాకముందు మద్యం నియంత్రణ అని చెప్పి, అధికారంలోకి వచ్చాక కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక గౌడ కులస్తులకు నీరా కేఫ్ లు ఏర్పాటు చేస్తాం. మద్యం దుకాణాల్లో బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తాం.
ఉప్పర లక్ష్మి, బాధిత చిన్నారి తల్లి, గంజళ్లగ్రామం, కర్నూలుజిల్లా: నా బిడ్డ నేడు 6వ తరగతి చదువుతోంది. నా కూతురు 5వ తరగతి చదువుతున్న సమయంలో వైసీపీ నాయకుడి భార్య మా ఇంటికి వచ్చి బాత్ రూమ్ కు వెళ్లడానికి తోడుగా రావాలని అడిగి తీసుకెళ్లింది. నా కూతురిని తన భర్తకు అప్పజెప్పి ఆమె వెళ్లిపోయింది. వైసీపీ నాయకుడు మద్యం సేవించి నా కూతురికి నరకం చూపించాడు. కేకలు వినిపించడంతో గ్రామస్తులు వెళ్లి నా కూతురిని వెతికారు. ఆ సమయానికి వైసీపీ నాయకుడు పారిపోయాడు. నా కూతురిని చావుబ్రతుకుల మధ్య ఇంటికి ఇంటికి తీసుకొచ్చారు. నేటికీ నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. నిందితులు మా కళ్లముందు తిరుగుతూ మమ్మల్ని వెక్కిరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నా కూతురికి న్యాయం చేయాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
లోకేష్: చట్టాలను అమలు చేసే నాయకులు సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. బాధితుల ఫిర్యాదులు తీసుకోవడానికి కూడా పోలీసులు సహకరించడం లేదు. ప్రభుత్వం సహకరించడం లేదు. ఇదే పరిస్థితి వైసీపీ నాయకుల పిల్లలకు జరిగితే ఇలాగే మౌనంగా ఉంటారా? అత్యాచారానికి గురైన చెల్లెమ్మకు తెలుగుదేశంపార్టీ అండగా నిలబడుతుంది. పాపను మేం చదివిస్తాం. ఈ బాధ్యతను నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. పాపపై దాడికి పాల్పడిన వాళ్లు ఎంతటివాళ్లు అయినా 9నెలల తర్వాత శిక్షించే బాధ్యత నేను తీసుకుంటాను.
వేముల శివ, మేడపి, యర్రగొండపాలెం: నేను వడ్డెర సమాజానికి చెందిన వ్యక్తిని. మా కులంలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. టెక్నాలజీ పెరిగినా వలసలు తగ్గడం లేదు. మా పిల్లల భవిష్యత్ కు భరోసా ఉండటం లేదు. మమ్మల్ని ఏ విధంగా ఆదుకుంటారు, మా కులం వారికి ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తారు.?
లోకేష్:ఎన్టీఆర్ వడ్డెర్లలో పేదరికం గుర్తించి మైన్లు కేటాయించారు. 1983 నుండి 2019 వరకు వాటిని వడ్డెర్లు అనుభవించారు. కానీ మంత్రి పెద్దిరెడ్డి వచ్చాక వారి మైన్లు లాక్కకున్నారు. టీడీపీ వచ్చాక మైన్లు ఇప్పించే బాద్యత తీసుకుంటాం. పశ్చిమ ప్రకాశం వెనకబడింది. సాగు, తాగు నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. నీరందించే బాధ్యత టీడీపీ తసుకుంటుంది. పశ్చిమ ప్రకాశంపై ప్రత్యేక దృష్టి పెట్టి రాయితీలు కల్పించి ఉద్యోగాలు కల్పిస్తాం.
అపరాజిత, నందం సుబ్బయ్య భార్య, ప్రొద్దుటూరు: నా భర్త ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అవినీతిని ప్రశ్నించినందుకు నా భర్తను రెండున్నరేళ్ల క్రితం చంపేశారు. కమీషనర్ రాధ, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బామ్మర్ధి అవినీతి ప్రశ్నించినందుకే చంపారు. ఈ పాలనలో బీసీలకు రక్షణ లేదు. నా భర్త హత్యలో ప్రమేయమున్న వారిని శిక్షించాలని లోకేష్ రెండు రోజులు ప్రొద్దుటూరులోనే ఉన్నారు. హత్యలో ప్రమేయమున్నవారిలో అందరినీ అరెస్టు చేయలేదు. ఎవరో మహిళను ఇబ్బంది పెట్టారని నా భర్తపై తప్పుడు ప్రచారం సృష్టించారు. మా నాన్నను ఎందుకు చంపారని నా బిడ్డలడుగుతున్నారు. మాకు ఇప్పటికీ న్యాయం జరగలేదు.
లోకేష్: సీఎం సొంత జిల్లాలోనే బీసీ సోదరున్ని కిరాతకంగా చంపారు. హత్య ఫోటో నాకు వాట్సాప్ లో వచ్చింది. చుట్టూ ఎవరూ లేరు..అపరాజిత తప్ప. ఒక చేనేత వర్గానికి చెందిన వాడు ఏం చేయలేడన్న భావన వాళ్లది. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. టీడీపీ పోరాడిన తర్వాతే పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. సీఎం సొంత జిల్లాలోనే బీసీలకు ఆ పరిస్థితి ఉంటే ఇక రాష్ట్రంలోని బీసీల పరిస్థితి ఏంటి.? నేను వైసీపీ నేతలనడుగుతున్నా… చంద్రబాబు హయాంలో ఒక్క సారి ఆయన కనుసైగ చేసుండుంటే మీరు రాష్ట్రంలో ఉండేవాళ్లా.? మీ జగన్ పాదయాత్ర చేసేవాడా.? 26 వేల మంది బీసీలపై వైసీపీ వచ్చాక అక్రమంగా కేసులు పెట్టారు. బీసీ ప్రభుత్వమని చంకలు గుద్దుకునే వారు ఏమయ్యారు. జోకర్ జోగి రమేష్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు.? జోగి రమేష్ ఇంట్లో హత్య జరిగితే ఇలాగా మాట్లాడతారు. నందం సుబ్బయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది..వారి పిల్లల్ని చదివించే బాధ్యత మా అమ్మ తీసుకుంది. వైసీపీ కార్యకర్తలను రెండు దెబ్బలు కొడితే జగన్ మిమ్మల్ని పరామర్శిస్తారా.?
రంగయ్య, యర్రగొండపాలెం నియోజకవర్గం : టీడీపీ వాళ్లమని వెలుగొండ ప్రాజెక్టు ముంపు లిస్టు నుండి మా పేర్లు తొలగించారు. మేము రజకులం. మమ్మల్ని గెజిట్ లో చేర్చాలి. ఓటు వేయలేదని పరిహారం లిస్టులో నుండి తొలగించారు.
లోకేష్: పాలకుల ప్రవర్తనతోనే ఈ సమస్య. ఎన్నికల ముందు అందరికీ న్యాయం చేస్తానన్నాడు. ఇతరులకు పనులు చేయరు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. 4 ఏళ్ల 9 నెలలు ప్రజలకు మంచి చేయాలని చంద్రబాబు అనేవారు. టిడిపి అధికారంలోకి వచ్చాక గెజిట్ ఏర్పాటు చేసి సాయం అందిస్తాం. రజకులకు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ ఇవ్వలేదు. టీడీపీ హయాంలో దోబీ ఘాట్లు నిర్మించాం. రాజకీయంగా, ఆర్థికంగా రజకులను పైకి తెస్తాం.
ఆడియన్స్: రాష్ట్రంలో రజకులకు చెరువులు, కుంటలపై హక్కులు కల్పించాలి. ఎన్నో చెరువులు, కుంటలు ఆక్రమించారు. దోభీ చేయాల్సిన పనులు బడా వ్యాపారులు చేస్తున్నారు. ఆసుపత్రుల్లోనూ రజకులు చేయాల్సిన పనులు రజకులకే కేటాయించారు. నాయూ బ్రాహ్మణులకు బోర్డు మెంబర్ గా కేటాయించారు. మాకు కూడా దేవాలయ బోర్డులో మెంబర్ షిప్ కల్పించాలి. వినుకొండలో ఇద్దరు రజకుల తలలు పగలగొట్టారు.
లోకేష్: ఈ ప్రభుత్వం వచ్చాక కొండలు, గుట్టలు, చెరువులు మాయం చేస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రజకులకు పనిముట్లు అందించాం. ఈ ప్రభుత్వం వచ్చాక ఆదరణ పథకాన్ని రద్దు చేసింది. ఆదరణ పథకాన్ని మళ్లీ తీసుకొచ్చి మంచి పరికరాలు అందిస్తాం. రజకులకు దోభీఘాట్ల వద్ద హక్కులు కల్పిస్తాం. రజకులను రాజకీయంగా పైకి తెచ్చేది టీడీపీనే. డ్రై క్లీనింగ్ అన్ని గ్రామాల్లో వచ్చాయి. రజక కార్పొరేషన్ ద్వారా డ్రై క్లీనింగ్ మిషన్లు అందచేస్తాం.
ఆడియన్స్: విశ్వబ్రాహ్మనులకు జగన్ ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వలేదు. టీడీపీ వచ్చాక మాకు ఎమ్మెల్సీ ఇవ్వాలి.
లోకేష్: రజకుల మాదిరే విశ్వబ్రాహ్మణులను జగన్ మోసం చేశాడు. టీడీపీ వచ్చాక రాజకీయంగా విశ్వబ్రాహ్మణులను టీడీపీ ప్రోత్సహిసస్తుంది.
రామాంజనేయులు, పర్చూరు : మత్స్యకారులను మీరు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఆదుకుంటారు?
లోకేష్: వైసీపీ వచ్చాక బీసీలపై దాడులు పెరిగాయి. అనేక మంది బీసీలను చంపారు. ఉప కులాల వారీగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ లకు నిధులు లేవు. చెరువులపై మత్య్సకారులకు హక్కులు లేకుండా 217 జీవో తెచ్చారు..ఆ జీవోను మేమొచ్చాక రద్దు చేస్తాం. మత్య్సకారులకు బోట్లు, వలలు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వంలో ఇవ్వడం లేదు. అందరికీ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే మీకూ ఇస్తున్నారు. మిమ్మల్ని అడ్డంగా పెట్టుకుని బూతులు తిడుతున్నారు. బీసీ సోదరులకు జోగి రమేష్ ఏం చేశాడు? జగన్ ఏం చేశాడు.? బీసీ బిడ్డల్ని చంపారు..ఎందుకు వారికి అండగా నిలబడలేదు? అమర్నాథ్ గౌడ్ ను చంపితే ఎందుకు జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. 2019కు ముందు మాయమాటలు చెప్పి..ఇప్పుడు తంతున్నాడు. దాడులు చేసిన వారిని, దొంగ కేసులు పెట్టి వేధించినవారిని వదిలిపెట్టను. టీడీపీని బీసీలు ఆదరించాలి. సైకోను ఇంటికి శాశ్వతంగా ఇంటికి పంపితేనే రాష్ట్రంలో బిసి, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు రక్షణ సాధ్యమవుతుంది.