టిడిపి ఆధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డెర్లకు సామాజిక, ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం కర్నూలు దర్వేష్ ఖాద్రి దర్గా వద్ద వడ్డెర సామాజిక వర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో 35లక్షలమంది వడ్డెర కులస్తులం ఉన్నాం. తీవ్ర పేదరికంలో ఉన్న మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. కొండ ప్రాంతాల్లో క్వారీ పనిచేసే వడ్డెర్లు ప్రమాదంలో మరణిస్తే రూ.10లక్షల బీమా కల్పించాలి. వడ్డెర్లకు కటింగ్ మిషన్లు, జెసిబి, టిప్పర్లు, ట్రాక్టర్లు సబ్సిడీపై అందించాలి.
బేలుదారి, మట్టిపనిచేసే వడ్డెర్లకు బీమా సౌకర్యం కల్పించాలి. వడ్డెర కులస్తులకు బ్యాంకు లింకేజి ద్వారా కాకుండా బిసి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. వడ్డెర్లకు గతంలో ప్రభుత్వం కేటాయించిన క్వారీలను వైసిపి నేతలు లాక్కుని తీవ్ర అన్యాయం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి నేతలు ఆక్రమించిన క్వారీలను వడ్డెర్లకు అప్పగిస్తాం. వడ్డెర్లకు యంత్రపరికరాలు, పనిముట్ల కొనుగోలుకు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందజేస్తాం. ప్రమాదంలో మృతిచెందిన వడ్డెర సోదరులకు చంద్రన్న బీమాను వర్తింపజేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.