టిడిపి అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని పునరుద్దరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం ఆలూరు నియోజకవర్గం పుప్పలదొడ్డిలో యాదవ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మాకు దామాషా ప్రకారం ఎమ్మెల్యే సీట్లు, నామినేటెడ్ పోస్టులు కేటాయించాలి. గొర్రెల కాపరులకు 50ఏళ్లకు పెన్షన్ అందించాలి. గొర్రెలతో పాటు, ఆవులను కూడా సబ్సిడీపై అందించి, వాటికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలి. స్కిల్ డెవలప్ మెంట్ కింద యాదవ యువతీ, యువకులకు శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించాలి.
యాదవ విద్యార్థులకు విదేశీవిద్య పథకాన్ని అమలు చేసి రూ.20లక్షలవరకు సాయం అందించాలి. టీటీడీ పాలకమండలిలో శాశ్వత సభ్యునిగా యాదవులను నియమించాలి. రాష్ట్రంలో ప్రతిజిల్లాలో స్థలాలు కేటాయించి, యాదవ భవనాలు నిర్మించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాజకీయంగా యాదవులకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టిడిపి హయాంలో కీలకమైన ఆర్థికమంత్రిగా యనమల, టిటిడి చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ లను నియమించాం. యువతకు స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. సబ్సిడీపై గొర్రెలు, ఆవులు అందజేసి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.