టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం కర్నూలు 13వవార్డు బంగారుపేట వాసులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కర్నూలు 13వవార్డు ఆర్టీసి బస్టాండు, రైల్వేస్టేషన్ లకు కూతవేటు దూరంలో ఉంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా కాలనీ అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
మా వార్డులో అత్యధికంగా నివసిస్తున్న నీలిషికారి తెగవారికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా నీలిషికారి తెగవారిని ఎస్టీ జాబితాలో చేర్చాలి. నీలిషికారి తెగవారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి. 13వవార్డులో డ్రైనేజి సమస్య అధికంగా ఉంది. వర్షం వస్తే వీధులు మోకాటిలోతు నీటితో నిండిపోతున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక మా వార్డు సమస్యలు పరిష్కరించండని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
వైసిపి నాయకులకు దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణాల్లో పేదలు నివసించే బస్తీలను మురికికూపాలుగా మార్చేసింది. పేదలు నివసించే ప్రాంతాల్లో కనీసం తాగునీరు, డ్రైనేజి వంటి సౌకర్యాలను కల్పించడం లేదు. నీలిషికారి తెగవారి ఉపాధికి చర్యలు తీసుతీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.