టిడిపి అధికారంలోకి వచ్చాక చాబోలు భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం నంద్యాల రూరల్ చాబోలు భూ నిర్వాసితులు యువనేత లోకేష్ ను తమ సమస్యలను విన్నవించారు. మా గ్రామ ప్రజలమంతా వ్యవసాయంపై జీవనం కొనసాగిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం ఇటీవల మా గ్రామంలోని వెయ్యి ఎకరాల భూమిని మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఇండస్ట్రియల్ జోన్ గా మార్చింది. ఆ భూములన్నీ మాల, మాదిగ, బోయ, దూదేకులకు చెందిన సన్న, చిన్నకారు రైతులవి.
స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల భూములను మాత్రం కమర్షియల్ జోన్ లోకి మార్చుకున్నారు. మా సమస్యలపై ఎమ్మెల్యే, ఎంపీలకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మా భూములను ఇండస్ట్రియల్ జోన్ నుండి తొలగించాలి. నేషనల్ హైవే-44 ను దాటేప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక హైవేకి ఇరువైపులా సర్వీసురోడ్లు నిర్మించాలి. మా గ్రామంలో డ్రైనేజీ సమస్య అత్యధికంగా ఉంది. పక్క గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక రోడ్లు, డ్రైన్లు నిర్మించండి అని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక ఎప్పుడు ఎవరి భూములు కొట్టేస్తాడోనని జనం బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఎపి చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీల భూముల విస్తీర్ణం తగ్గిందని కేంద్ర నివేదికలు చెబుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దోచుకోవడం పై పెట్టిన శ్రద్ధ, ఓట్లేసి గెలిపించిన ప్రజల సంక్షేమం పై పెట్టడం లేదు. చాబోలు గ్రామంలో రోడ్లు, డ్రైనేజిలు, ఇతర మౌలిక సదుపయాలు కల్పిస్తాం. ఎన్.హెచ్-44 కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించి ప్రమాదాలను అరికడతాం అని హామీ ఇచ్చారు.