టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కెసి కెనాల్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా శనివారం మైదుకూరు నియోజకవర్గం నాగాయపల్లె రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామ ప్రజలంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం. వ్యవసాయానికి మాకు కేసీ కెనాల్ నుండి నీరు అందుతుంది. వైసీపీ పాలనలో కాలువ మరమ్మతులు చేయకపోవడంతో నీరు సరిగా రావడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక కేసీ కెనాల్ మరమ్మతులు చేయించాలి.
పొలం వెళ్లేందుకు నాగాయపల్లె నుండి నెర్రవాడ కు సరైన రోడ్డు మార్గం లేదు. వైసీపీ నాయకులను ఎన్నిసార్లు అడిగినా రోడ్డు గురించి పట్టించుకోవడం లేదు. సోమాపురం నుండి ఎస్సీకాలనీకి సరైన రోడ్డు లేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, ఎవరూ పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరుతున్నాం. మొర్రాయపల్లె గ్రామంలో శ్మశానం ఏర్పాటు చేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాల్వలు, సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణను గాలికొదిలేశారు. ముఖ్యమంత్రి జగన్ నిర్వాకం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61 నిండు ప్రాణాలు బలయ్యాయి. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మొర్రాయపల్లెలో శ్మశానవాటిక ఏర్పాటుచేస్తాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.