టిడిపి అధికారంలోకి వచ్చాక బుధవారపుపేట వాసులకు పట్టాలు అందజేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం కర్నూలు 14వవార్డు బుధవారపుపేట వాసులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. గత 40సంవత్సరాలుగా బుధవారపుపేట జయశ్రీ పెట్రోలు బంకు వెనుక వైపు దాదాపు 86 కుటుంబాలు ఇళ్లు కట్టుకొని జీవనం సాగిస్తున్నాయి. ఇందులో చాలావరకు ముస్లిం మైనారిటీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు.ఇప్పటివరకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదు.
హంద్రీనది ఒడ్డున నివసించేవారికి గతంలో రక్షణ గోడ నిర్మించాలని శంకుస్థాపన కూడా చేశారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక దానిని నిలిపివేశారు. దీనివల్ల హంద్రీనదికి వరదలు వచ్చినపుడు, తుంగభద్ర నదిలో బాక్ వాటర్ సమయంలో నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి. బుధవారపుపేటలో రోడ్లు, కల్వర్టులు, కరెంటు పోల్స్ ఏర్పాటుచేయాలి. 14వవార్డులో హిందూ, ముస్లిం శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
వైసిపి ప్రభుత్వానికి పన్నుల వసూలుపై ఉన్న శ్రద్ధ, నగరవాసులకు సౌకర్యాలు కల్పించడంలో లేదు. హంద్రీనదికి రక్షణ గోడ నిర్మించి ముంపు సమస్యను పరిష్కరిస్తాం. తాగునీరు, రోడ్లు, విద్యుత్ సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తాం. బుధవారపు పేటలో హిందూ, ముస్లిం శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.