టిడిపి అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతాంగం, కూలీలకు ఉపయోకరంగా మారుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం కమలాపురం నియోజకవర్గం రమణయ్యపల్లి క్రాస్ వద్ద కమలాపురం నగరపంచాయితీ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కమలాపురంను నగర పంచాయతీగా మార్చారు. దీన్ని ఆధారంగా చేసుకుని మా గ్రామంలో ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేశారు. పంచాయతీగా ఉన్నప్పుడు ఈగ్రామంలో 4,500 ఉపాధిహామీ జాబ్ కార్డులుండేవి.
కమలాపురంలో 70శాతం మంది దినసరి కూలి పనులపై ఆధారపడి జీవించేవారు ఉన్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధిహామీ పనులు చేసుకుని బ్రతికేవారు. నేడు పనులు లేకపోతే పస్తులుండాల్సిన పరిస్థితులు తెచ్చారు. నగర పంచాయతీ చేసిన నాటి నుండి కుళాయిపన్ను, చెత్తపన్ను, ఇతరత్రా పన్నులుకట్టలేకపోతున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక మా పంచాయతీలోని పేదలను ఆదుకోవాలి. ఉపాధిహామీ పథకాన్ని పునరుద్ధరించి న్యాయం చేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
కేవలం పన్నుల బాదుడు కోసమే ముఖ్యమంత్రి జగన్ గ్రామాలను నగర పంచాయితీలుగా అప్ గ్రేడ్ చేశాడు. వివిధ రకాల పన్నులతో జనానికి చుక్కులు చూపించడం తప్ప ఆయా గ్రామాల్లో చేసిందేమీ లేదు. గ్రామీణ ప్రజలకు వరమైన ఉపాధి హామీ పథకాన్ని కమలాపురం ప్రజలకు తొలగించడం అన్యాయం. ఈవిధంగా అప్ గ్రేడ్ చేసిన గ్రామాల్లో ఉపాధి హామీ కొనసాగించే అంశంపై కేంద్రానికి లేఖరాస్తాం. అడ్డగోలు పన్నుల విధానాన్ని సమీక్షించి ప్రజలకు ఉమశమనం కలిగిస్తాంమని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.