టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నమయ్య ప్రాజెక్ట్ మరమ్మతు పనులు చేపట్టి కోడుమూరు మండల రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం కోడుమూరు మండలం లద్దగిరి, అల్లీనగరం, కొండాపురం, యర్రదొడ్డి, చిల్లబండ గ్రామాల రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం
సమర్పించారు.
దశాబ్దాల క్రితం తుంగభద్ర లో లెవల్ కెనాల్ (ఎల్ఎల్ సి) నుంచి మా పొలాలకు రెండు పంటలకు నీరిచ్చారు. గత పదేళ్లుగా నీళ్లు రావడం లేదు. మా గ్రామాలకు వచ్చే కాలువకు బావులవంపు వంక పైనుంచి 20 సైపన్లు (పైపులు) వర్షపునీరు కిందకు వెళ్లేలా అమర్చారు.ఆ పైపులు శిథిలమైనందున కొత్తవి ఏర్పాటుచేసి, పైనుంచి వచ్చే కాల్వకు మరమ్మతులు చేపట్టాలి.ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్య పరిష్కరించండి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
వైసిపి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు నిర్మించకపోగా, చిన్నచిన్న మరమ్మతు పనులు కూడా చేయలేని దివాలాకోరు స్థితిలో ఉంది.
గత టిడిపి హయాంలో రాయలసీమలో ప్రాజెక్టుల కోసం రూ.11,700 ఖర్చుచేస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక 10శాతం కూడా ఖర్చుచేయలేదు.
మరమ్మతులు చేయకపోవడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61మంది ప్రాణాలు కోల్పోయారు అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.