నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రూ.3వేల నిరుద్యోగ భృతి ప్రకటించారు. దీనిని అమలుచేసి తీరుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం ప్రొద్దుటూరు ఆంజనేయస్వామి గుడివద్ద పట్టణానికి చెందిన నిరుద్యోగ యువకులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం
సమర్పించారు.
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జాబ్ నోటిఫికేషన్లు లేక యువత తీవ్ర నిరాశ,నిస్పృహల్లో ఉన్నారు. వివిధ ఉద్యోగాలకోసం వేలాది రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకున్నా
ఉపయోగం లేకుండా పోయింది. మీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ యువతకు రూ.3వేల భృతి కల్పించి ఆదుకోండి. రాష్ట్రంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఏర్పాటుచేసి వలసలను నివారించండి. మీరు అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ విడుదలచేసి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతను దారుణంగా మోసగించారు. అధికారంలోకి వచ్చాక 2.30లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తానని చెప్పి, జాబ్ లెస్ క్యాలండర్ విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి చర్యల కారణంగా తీవ్ర నిరాశ,నిస్పృహలకు గురైన 470మంది యువతీయువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించి 20లక్షల ఉద్యోగాలు కల్పన ద్వారా వలసలను నివారిస్తాం. యువత భవిష్యత్తు కోసం వచ్చే ఎన్నికల్లో చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు సహకరించండి అని లోకేష్ వారికి విజ్ఞప్తి చేశారు.