టిడిపి అధికారంలోకి వచ్చాక ప్రొద్దుటూరులో ఉన్న సత్రాలను ఆర్యవైశ్యసభకు అప్పగిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రొద్దుటూరు అమ్మవారిశాల వద్ద ఆర్యవైశ్యులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఆర్యవైశ్య సభల ఆధ్వర్యంలో నడిచే దేవస్థానాలకు స్వతంత్ర అజమాయిషీ కల్పిస్తూ జీఓ ఇవ్వాలి. ప్రొద్దుటూరు ఎరుకలయ్య ఆశ్రమం, మిట్టా పాపయ్య సత్రం, రంగయ్య సత్రాలను ఆర్యవైశ్య సభకు అప్పగించాలి. టీటీడీ పాలకమండలి సభ్యుల్లో ఆర్యవైశ్యులకు స్థానం కల్పించాలి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఆర్యవైశ్యులకు దామాషా ప్రకారం కౌన్సిలర్ స్థానాలు కేటాయించాలి అని విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
స్వచ్చందంగా పనిచేసే ఆర్యవైశ్య సభలను సైతం జగన్ ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇబ్బందులకు గురిచేయడం దారుణం. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏ సామాజికవర్గం ప్రశాంతంగా జీవించే పరిస్థితులు లేవు. ఆర్యవైశ్య సభలు రాజకీయాలకు అతీతంగా స్వతంత్రంగా తమ కార్యకలాపాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.