టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శర్మ కమిషన్ నివేదిక మేరకు బేడ, బుడగ జంగాలకు శాశ్వత కులధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బేడ, బుడగ జంగాలు లోకేష్ ను కలసి సమస్యలపై విన్నవించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బుడగ జంగాలకు 2008లో జిఓ నెం.144 ద్వారా ఎస్సీ సర్టిఫికెట్లు నిలుపుదల చేశారు.
2019లో నియమించిన జెసి శర్మ కమిషన్ 2020లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పటికీ ఆ నివేదికను ఇంతవరకు ఆమోదించలేదు. ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం మేం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వండి. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇప్పించి ఆదుకోండి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకోవడం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. న్యాయమైన డిమాండ్లతో పోరాటం చేస్తున్న బేడ, బుడగ జంగాలకు అండగా నిలుస్తాం. బేడ, బుడగ జంగాలకు దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.