టిడిపి అధికారంలోకి వచ్చాక చియ్యపాడు దళితులకు చెందిన భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకొని సొంతదారులకు అప్పగిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా శుక్రవారం మైదుకూరు నియోజకవర్గం చియ్యపాడు గ్రామ దళితులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం
సమర్పించారు.
మా కాలనీలో సుమారు 250 కుటుంబాలున్నాయి. తరతరాలుగా మేం ఇమాందార్లు, మేటిదార్లుగా పనిచేస్తున్నాం. మాకు చెందిన భూములు కొందరు అధికారపార్టీ వారి ఆక్రమణలో ఉన్నాయి. దొంగతనంగా ఆ భూములకు పట్టాదారు పుస్తకాలు తెచ్చుకుని అనుభవిస్తున్నారు. సర్వే నంబర్ 598, 600, 10.20, 6.80 ల్లో మా భూములు కొన్ని ఉన్నాయి. వాటిని మేం పంచుకోలేక, నీరులేక పంటలు వేయలేకపోవడంతో భూములు బీడుగా మారాయి. భూములను బాగుచేసుకునేందుకు కలెక్టర్లు, అధికారులు మాకు పాసు పుస్తకాలు ఇవ్వడం లేదు. సర్వే నంబర్లు 598, 600ఎం.2.0 భూముల్లో కొంత మంది పోలీసులను అడ్డుపెట్టి ప్లాట్లు వేసుకున్నారు. కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కలెక్టర్ మా భూమిని ప్రభుత్వ భూమి అని, ఇళ్ల పట్టాలు ఇస్తామని చెబుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా భూములను మాకు ఇప్పించి న్యాయం చేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వారిపైనే ఉక్కుపాదం మోపుతూ తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక దళితులకు చెందిన 12వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కున్నారు.రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గత నాలుగేళ్లలో దళితుల వద్ద ఉన్న భూమి విస్తీర్ణం తగ్గిపోయింది. ఎస్సీలకు చెందాల్సిన సబ్ ప్లాన్ నిధులు రూ.28,147కోట్లు దారిమళ్లించారు.దళితులకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. వైసీపీ పాలనలో దళితుల ప్రాణాలకు, ఆస్తులకు, భూములకు రక్షణ కరువైందని లోకేష్ ఆవేదన
వ్యక్తం చేశారు.