టిడిపి అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు ఆర్టీసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణసౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం కమలాపురం నియోజకవర్గం శేషయ్యవారిపల్లిలో నియోజకవర్గంలోని దివ్యాంగులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని జిల్లాల్లో దివ్యాంగుల సంక్షేమ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. వికలాంగులకు పెన్షన్ పెంచుతామని వైసీపీ మోసం చేసింది. మీరు అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల పెన్షన్ ను రూ.6వేలకు పెంచాలి.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల సాకులతో 95వేల మంది దివ్యాంగుల పెన్షన్లను వైసిపి ప్రభుత్వం తొలగించింది, వాటన్నింటినీ పునరరుద్దరించాలి. దివ్యాంగుల రోస్టర్ పాయింట్ టాప్-10లో పెట్టాలి. స్వయం ఉపాధి కల్పిస్తే దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపినవారవుతారు. భార్య,భర్తలు దివ్యాంగులైతే వారిలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలి. చదువులేని వారికి రూ.5లక్షలు రుణం ఇప్పించాలి. దివ్యాంగులున్న కుటుంబానికి అంత్యోదయ కార్డుల ద్వారా 35కేజీల బియ్యం, ఉచితంగా 6 సిలిండర్లు ఇవ్వాలి. ఆర్టీసీలో వికలాంగుల రిజర్వేషన్ ప్రకారం బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలి. ప్రభుత్వ కార్యాలయాలకు దివ్యాంగులు వెళ్లేలా ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేయాలి. సదరం సర్టిఫికెట్ ఉన్న ప్రతి దివ్యాంగులు, వాళ్ల కుటుంబ సభ్యులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
దివ్యాంగుల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. సదరం సర్టిఫికెట్లు ఇవ్వకుండా దివ్యాంగులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత టిడిపి ప్రభుత్వంలో దివ్యాంగుల సంక్షేమానికి రూ.6,500 కోట్లు ఖర్చుచేశాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సర్టిఫికెట్లు కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా శాశ్వత సర్టిఫికెట్లు జారీచేస్తాం. వైసిపి అధికారంలోకి వచ్చాక ట్రైసైకిళ్లు, త్రీ వీలర్ స్కూటర్లు, కృత్రిమ అవయవాలు పంపిణీ నిలిపేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల ఉపాధికి సబ్సిడీ రుణాలను అందజేస్తాం. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ర్యాంపుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.