గాజులదిన్నె ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు అండగా నిలుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం గాజులదీన్నే ప్రాజెక్ట్ ముంపు రైతులు యువనేత లోకేష్ ను కలసి వినతిపత్రం అందజేశారు. గోనెగండ్ల మండలం ఐరన్ బండ-ఎ, ఎన్నెకండ్ల, గంజిహళ్ళి,గోనెగండ్ల, నేరుడుప్పల గ్రామాల రైతులు 1977లో గాజులదిన్నె ప్రాజెక్ట్ కట్టడానికి 5వేల ఎకరాల భూమి ఇచ్చారు.
ప్రస్తుతం మిగిలిన ఒకటి,రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాం.
తాజాగా గాజులదిన్నె ప్రాజెక్ట్ ఎత్తు పెంచాలని ప్రస్తుత ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
కమీషన్ల కోసం వైసిపి నాయకులు ప్రాజెక్టు ఎత్తు పెంచే పనులు మొదలుపెట్టారు.
ముంపు రైతుల సమస్యలు గాలికొదిలేశారు.
మా గ్రామంలో ఎకరా భూమి మార్కెట్ ధర రూ.30లక్షల వరకు ఉంది.
ముంపునకు గురి అయినా భూములకు కేవలం రూ. 4.2లక్షలు మాత్రమే పరిహారం ఇస్తామంటున్నారు.
మాకు కనీసం ఎకరాకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలి.
జిఓ నెం.98 ప్రకారం ప్రతి ఇంటికి ఒక ఉధ్యోగం, పునరావాసం కింద రూ.4లక్షల రూపాయల సాయం అందజేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందించాల్సి ఉంది.
ప్రభుత్వమే చట్టవిరుద్దంగా ఇష్టానుసారం రైతుల భూమి లాక్కోవడం కుదరదు.
భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందించాల్సిందిగా ప్రభుత్వానికి లేఖరాస్తామని వారికి హామీ ఇచ్చారు.