టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నాగులాపల్లి రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగాశుక్రవారం మైదుకూరు నియోజకవర్గం నాగులపల్లె గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
మైదుకూరు వయా పొద్దుటూరు రోడ్డు నుంచి నాగులపల్లె వెళ్లే రహదారి 3 కి.మీ. ధ్వాన్నంగా తయారైంది. ఈ రహదారిలో ఉన్న నాగులపల్లె, ఖాదర్ పల్లె గ్రామాల్లో 4వేల జనాభా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ఈ రోడ్డుని డబుల్ రోడ్డుగా విస్తరించి మా ఇబ్బందులను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇదివరకెన్నడూ లేనివిధంగా రోడ్లు దారుణంగా తయారయ్యాయి. ముఖ్యమంత్రి, ఆయన సామంతరాజులకు దాచుకోవడం, దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ రోడ్లపై లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నిలువెత్తు గోతులు దర్శనమిస్తున్నా తట్టమట్ట పోసే దిక్కులేదు. దివాలాకోరు పాలన చూసి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ సిసి రోడ్లు, లింకురోడ్లు నిర్మించామని లోకేష్ చెప్పారు.