టిడిపి అధికారంలోకి వచ్చాక నడకైరవాడి, మాచాపురం గ్రామాల్లో అర్హులైన వారందరికీ ఇళ్లస్థలాలు, ఇళ్లు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా శుక్రవారం మాచాపురం, నడకైరవాడ గ్రామస్తులు లోకేష్ ను కలిసి వారి సమస్యలు విన్నవించారు. 2009లో నడికైరవాడి గ్రామం వరదకు ముంపునకు గురైంది. వరద కారణంగా మా ఇళ్లన్నీ పాడైపోయాయి. కొందరి స్వార్థపూరిత ఆలోచనల కారణంగా మాకు ఇళ్లస్థలాలు కేటాయించలేదు. ప్రస్తుతం స్థలాలు లేక తాత్కాలిక రేకుల షెడ్లు వేసుకొని జీవనం సాగిస్తున్నాం. టిడిపి అధికారంలోకి వచ్చాక మాకు ఇళ్లస్థలాలు, ఇళ్లు కేటాయించండి. మా గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపండి. మాచాపురంలో ఎస్సీలు, బిసిలు, కాపులకు శ్మశానవాటిక లేదు.
టిడిపి ప్రభుత్వం వచ్చాకు మా కులాలకు విడివిడిగా స్థలాలు కేటాయించండి. గురురాఘవేంద్ర చిలకలడోన ఎత్తిపోతల పథకం కింద సాగయ్యే 4,500 ఎకరాల్లో మాచాపురం గ్రామ పొలాలు కూడా ఉన్నాయి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ ఫుట్ బాల్ ఒక మీటరు ఎత్తులో నిర్మించడం వల్ల పంప్ హౌస్ కు నీరు సరిగా అందడం లేదు. మాచాపురం ఎస్సీ కాలనీలో తాగునీటి కుళాయిల్లో నీరు గతంలో సరిపడా వచ్చేది.గత నాలుగేళ్లుగా తాగునీటి సమస్య తీవ్రమైంది. ఎస్సీ కాలనీలో ఇంతవరకు ఎవరికీ ఇంటి స్థలాలు ఇవ్వలేదు. టిడిపి ప్రభుత్వం వచ్చాక ఎస్సీలకు ప్లాట్లు, కాలనీకి తాగునీరు అందించండి అని వారు కోరారు.
వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. మాచాపురం వాసులు కోరిన విధంగా శ్మశాన వాటికలకు స్థలం కేటాయిస్తాం. చిలకలడోన లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ సమస్యను పరిష్కరించి సజావుగా నీరందేలా చేస్తాం. ఎస్సీ కాలనీతోపాటు గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.