టిడిపి ప్రభుత్వం అధికారలోకి వచ్చిన వెంటనే ఆదరణ పథకాన్ని పునరుద్దరించి స్వర్ణకారులకు అధునాతన పనిముట్లు అందజేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం ప్రొద్దుటూరు బంగారు అంగళ్లు సెంటర్ లో ఎపి ముస్లిం స్వర్ణకార సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
గత టిడిపి ప్రభుత్వంలో ఆదరణ పథకం ద్వారా స్వర్ణకార వృత్తిని ప్రోత్సహించి పనిముట్లు ఇచ్చారు. స్వర్ణకార వృత్తిలో ఉన్న ముస్లిములను గుర్తించి రూ.10కోట్లు కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం ఆ నిధులువిడుదల చేయలేదు. స్వర్ణకారులకు 50ఏళ్లకే పెన్షన్లు మంజూరు చేయాలి. స్వర్ణకారులకు సంఘం కార్యకలాపాలు, శుభకార్యాలు చేసుకోవడానికి సంక్షేమ భవనాన్ని నిర్మించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ చేతివృత్తుల వారి ఉపాధిని దెబ్బతీశారు. గత టిడిపి ప్రభుత్వం ఆదరణ పథకం కింద చేతివృత్తుల వారికి 90శాతం సబ్సిడీపై రూ.964 కోట్ల రూపాయలతో వివిధ పరికరాలు అందజేసింది. స్వర్ణకార ముస్లింలకు గత ప్రభుత్వం కేటాయించిన నిధులు విడుదలచేసి, వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటాం. ప్రొద్దుటూరులో స్వర్ణకార సంక్షేమ భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు.