టిడిపి అధికారంలోకి వచ్చాక మళ్లీ మళ్లీ సమస్యలు తలెత్తకుండా ఖురేషిలతో సహా ఇతర ముస్లిం ఉపకులాలకు సంబంధించి ప్రత్యేక జిఓ ఇచ్చి శాశ్వత కులధృవీకరణ పత్రాలు జారీచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం కడిమెట్ల ఫక్రీ సాదర్ చౌక్ లో ఎమ్మిగనూరు ఇస్లాం ముస్లిం ఖురేషీ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏపీ ప్రభుత్వం 2016, ఏప్రిల్ 6వ తేదీన జస్టిస్ వి.ఈశ్వరయ్య కమిషన్ ఓబీసీ సీరియల్ నెం.62-ఏలో ముస్లిం ఖురేషీ అని చేర్చారు.
దగెజిట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ 11/08/2016(ఓల్డ్ సీరియల్ నెం.62) ప్రకారం కటిక, ఖురేషీలను ఓబీసీలుగా భారత ప్రభుత్వం గుర్తించింది.
ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బి.వి.జయనాగేశ్వర్ రెడ్డి గతంలో మాకు ఓబీసీ సర్టిఫికెట్లు అందించారు.
ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓబీసీ సర్టిఫికెట్లు జారీ కావడం లేదు.
కటిక, ఖురేషీ అనే పదాలను అడ్డుపెట్టి అధికారులు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక కటిక/ఖురేషీలను ఓబిసిలుగా పరిగణిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, జిఓ విడుదలచేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనారిటీలను వేధించడమే పనిగా పెట్టుకున్నారు.వివిధ రకాల సాకులు చూపి క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వడంలోనూ వైసీపీ ప్రభుత్వం మైనారిటీలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.