టిడిపి అధికారంలోకి వచ్చాక మెరుగైన డ్రైనేజి వ్యవస్థ, రోడ్లు నిర్మించి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం కడప చిన్నచౌక ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్నసమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కడప చిన్నచౌక్ ఏరియాలో మేం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వర్షాకాలంలో నీరు ఇళ్లల్లోకి ఆరు అడుగుల ఎత్తుకు వస్తున్నాయి. ఇళ్లలోని వస్తువులన్నీ పాడైపోతున్నాయి. 20ఏళ్లుగా ఈ సమస్యతో మేం సతమతమవుతున్నాం.
మా ప్రాంతంలో రోడ్లు మొత్తం గుంతలమయమయ్యాయి, డ్రైనేజీ, మురుగు కాలువలు లేవు. మా ప్రాంతంలో ప్రాథమిక వైద్యశాల కూడా లేదు. తిలక్ నగర్, రామకృష్ణనగర్, బీడీకాలనీ, రామాంజనేయపురం, శాంతినగర్, ప్రకాష్ నగర్ లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. 2వ డివిజన్ లోని మైనింగ్ మట్టిని కొంతమంది అక్రమంగా అమ్ముకుంటున్నారు. మట్టి రవాణా వల్ల 2వ డివిజన్ లోని నానాపల్లె, వైఎస్ఆర్ లే అవుట్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్లు, స్థానిక సంస్థలను పూర్తిగా గాలికొదిలేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కేంద్రంలో వర్షానికి ఇళ్లు మునిగిపోవడం సిగ్గుచేటు. అధికారపార్టీ నేతలు మట్టి, ఇసుక అక్రమ తవ్వకాల్లో మునిగిపోయారు. అక్రమ ఇసుక, మట్టి రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. అన్నక్యాంటీన్లను పునరుద్దరించి పేదలు, రోజువారీ కూలీల ఆకలి తీరుస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.