టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్డీఎస్ కుడికాల్వ పనులు ప్రారంభిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం రైతులు, దళితులు యువనేత నారా లోకేష్ ను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. గత ప్రభుత్వంలో టెండర్లు పూర్తయిన ఆర్ డిఎస్ కుడికాల్వ పనులను ప్రారంభించాలి. కర్నాటకలో తుంగభద్ర డ్యామ్ నుంచి ఎల్ఎల్ సి కాల్వకు అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు వేసి నీరు రప్పించాలి. కల్తీ విత్తనాలను అరికట్టి, ఎరువుల ధరలు తగ్గించాలి.
వైసిపి ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు బిగిస్తున్న మీటర్లను రద్దుచేయాలి. ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలి. గత ప్రభుత్వ హయాంలో నందవరం ఎస్సీ కాలనీలో 218మంది దళితులకు 3సెంట్ల చొప్పున మంజూరుచేసిన పట్టాలను వైసిపి ప్రభుత్వం రద్దుచేసింది. రద్దుచేసిన పట్టాలను పునరుద్దరించండి. 70సంవత్సరాలుగా ఎస్సీకాలనీ ప్రజలకు శ్మశానవాటిక లేదు. కాలనీలో సిసి రోడ్లు లేవు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం, చర్చి నిర్మాణానికి సహకారం అందించండి. గతంలో ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ. 5లక్షలు, సహజ మరణానికి 2లక్షలు ఇచ్చేవారు. వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన ఆ పథకాన్ని కొనసాగించండి. గత ప్రభుత్వం దళిత ఆడబిడ్డల,కు పెళ్లికానుక కింద రూ.50వేలు ఇచ్చేది, వైసిపి ప్రభుత్వం వచ్చాక రద్దుచేసిన ఆ పథకాన్ని కొనసాగించండి అని వారంతా విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాయలసీమలో గత ప్రభుత్వంలో నిర్మించినవి తప్ప ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా వైసిపి ప్రభుత్వం చేపట్టలేదు.
గతంలో మాదిరిగా రైతులకు సబ్సిడీపై డ్రిప్స్ స్ప్రింకర్లను అందజేస్తాం. కల్తీవిత్తనాలపై ఉక్కుపాదం మోపుతాం, సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందజేస్తాం. మోటార్లకు మీటర్లతో రైతులకు జగన్ ఉరితాడు బిగించాలని చూస్తున్నాడు. టిడిపి ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దుచేస్తాం. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేసి రాయలసీమలో వలసలను నివారిస్తాం. నందవరం ఎస్సీకాలనీ దళితులకు ఇళ్లపట్టాలు, ఇళ్లు మంజూరు చేస్తాం. దళితులకోసం గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలన్నీ కొనసాగిస్తాం. నందవరం ఎస్సీ శ్మశానవాటికకు స్థలం కేటాయిస్తాం. రైతులు, ఎస్సీలను మోసగించిన జగన్ కు
రాబోయే ఎన్నికల్లో తగిన బుద్దిచెప్పాలి అని లోకేష్ పిలుపునిచ్చారు.