టిడిపి అధికారంలోకి రాగానే ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం తాడిపత్రి నియోజకవర్గం లోని పెదపప్పూరు గ్రామస్థులు లోకేష్ ను కలిసి సమస్యలపై విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. ఇసుక అక్రమాలకు పాల్పడిన వారితో పాటు వారికి సహకరించిన వారిపైన సైతం కటినచర్యలు తీసుకుంటామని చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి ఇసుకపై రోజుకు రూ. 3 కోట్లు అక్రమ సంపాదన చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాడు అని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రకృతి వనరులను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ దోపిడీ విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని లోకేష్ చెప్పారు. రాజమండ్రీ సీతానగరం లో ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన దళిత యువకుడు వరప్రసాద్ కు వైసీపీ నాయకులు గుండు కొట్టించారని ఆరోపించారు. పెదపప్పూరు గ్రామంలో నీటికొరత లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.