టిడిపి అధికారంలోకి రాగానే పందిపాడు గ్రామంలో నీటి సదుపాయాన్ని కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు.
యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం పాణ్యం నియోజకవర్గం పందిపాడు గ్రామ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
2019 ఎన్నికల్లో మా గ్రామాన్ని మున్సిపాలిటీలో చేర్చుతామని హామీ ఇచ్చారు.
తాగునీటి సదుపాయం కల్పించి, ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.
మా గ్రామాన్ని 2021లో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ విలీనం చేశారు.
కానీ నేటికీ తాగునీటి సదుపాయం కల్పించలేదు.
మీరు అధికారంలోకి వచ్చాక మాకు తాగునీటి సమస్యను పరిష్కరించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్మోహన్ రెడ్డి పాలనలో గుక్కెడు నీరందక ప్రజలు అల్లాడుతున్నారు.
ఓట్ల కోసం ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక గాలికొదిలేశారు.
విలీనం గ్రామాల్లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆయా కార్పొరేషన్లదే.కేవలం పన్నుల కోసమే పరిసర గ్రామాలను కలిపేసి, తర్వాత వదిలివేయడం దుర్మార్గం.
ఆస్తివిలువ ఆధారిత ఇంటి పన్ను, చెత్తపన్ను, నీటి పన్ను అంటూ రకరకాల పన్నులతో నడ్డివిరుస్తున్నారు అని లోకేష్ విమర్శించారు.