కుందూనది నుంచి ఖాదర్ పల్లె చెరువులకు నీరందించే అవకాశాలను పరిశీలించి, ఇక్కడి రైతులకు నీరందించేలా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు.
యువగళం పాదయాత్ర సందర్భంగా శుక్రవారం మైదుకూరు నియోజకవర్గం ఖాదర్ పల్లె గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
కెసి కెనాల్ చాపాడు మెయిన్ చానల్ నెం.1 ఆయకట్టు చివరలో చాపాడు, ఖాదర్ పల్లె గ్రామపొలాలు ఉన్నాయి. చానల్ -1 అడ్డకాల్వ నుంచి వెళ్లే చెరువు కింద ఖాదర్ పల్లె కు చెందిన 1200ఎకరాల పొలాలు ఉన్నాయి. కాల్వ ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో చెరువుకు నీరందక ఇబ్బంది పడుతున్నాం. దీనివల్ల ఆయకట్టు చివరి భూముల రైతులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నీటికయ్యలు తీసుకొని నిల్వ చేసుకోవాల్సి వస్తోంది.
మా గ్రామానికి సమీపంలో ఉన్న కుందూనది నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులకు నీరందించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోజగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లలో రాయలసీమలో ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో సీమ ప్రాజెక్టుల కోసం రూ.11వేల కోట్లు ఖర్చుచేస్తే, గతనాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం ఖర్చుపెట్టింది కేవలం రూ.2,700 కోట్లు మాత్రమే. కుందూనది పక్కనే ఉన్నా ఖాదర్ పల్లి గ్రామరైతులు సాగునీటి ఇబ్బంది ఎదర్కోవడం దురదృష్టకరమని లోకేష్ పేర్కొన్నారు.