టిడిపి అధికారంలోకి వచ్చాక వెంటనే ఇసుక విధానాన్ని సరళీకరించి ఇసుకను అందుబాటులోకి తెస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం కడప అప్సర సర్కిల్ లో భవననిర్మాణ కార్మకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై యువనేత లోకేష్ కు వినతిపత్రం సమర్పించారు.భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై చర్చించుకోవడానికి స్థలం కేటాయించి, కమ్యునిటీ హాలు నిర్మించాలి.
భవన నిర్మాణ కార్మికులకు గృహ వసతి కల్పించి ప్రత్యేక కాలనీలు నిర్మించాలి. గుర్తింపు పొంది, 60ఏళ్లు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికునికి నెలకు రూ.5వేలు పెన్షన్ ఇవ్వాలి. గుర్తింపుకార్డు పొందిన కార్మికునికి ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.10లక్షలు ఆర్థిక సాయం చేయాలి. పనిప్రదేశంలో ప్రమాదానికి గురై అంగవైకల్యం ఏర్పడిన కార్మికునికి రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించాలి. పని ప్రదేశంలో మరణించిన గుర్తింపు లేని కార్మికునికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలి. ఇసుక, కంకర, రాయి, గ్రానైట్, మట్టికి రాయల్టీ తగ్గించాలని కోరుతున్నాం. ఇసుకను అందుబాటులోకి తెచ్చి భవన నిర్మాణ కార్మికులకు పూర్తిస్థాయిలో పనులు కల్పించాలి. కడప నగరంలో భవన నిర్మాణ కార్మికులు, పేదల కోసం అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధనదాహం భవన నిర్మాణ కార్మికులకు శాపంగా మారింది.స్థానికంగా లభించే ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తుండటంతో ఇసుక అందుబాటులో లేక నిర్మాణపనులు ఆగిపోవడం దురదృష్టకరం. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని ఇసుక మాఫియా గత నాలుగేళ్లుగా రూ.10వేల కోట్లు దోచుకుంది. 40లక్షలమంది భవన నిర్మాణ కార్మికులను రక్తమాంసాలను ఫణంగా పెట్టి జగన్ అక్రమ సంపాదనకు తెరలేపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి రూ.2వేల కోట్లను కూడా జగన్ ప్రభుత్వం దొంగిలించింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని పునరుద్దరించి, ఆర్థిక సాయాన్ని అందిస్తాం. చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్దరించి భవన నిర్మాణ కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తాం. అన్నాక్యాంటీన్లను ఏర్పాటుచేసి కార్మికులు, పేదల ఆకలి తీరుస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.