టిడిపి అధికారంలోకి రాగానే రాజధానిలో యాదవ సంఘ భవనానికి స్థలం కేటాయిస్తామనై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం కర్నూలు కుమ్మరిగేటు వద్ద యాదవ హక్కుల పోరాటసమితి ప్రతినిధులు యువనేత నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రతి నియోజకవర్గంలో యాదవ కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేయాలి. జి.ఓ.నెం.559, 1016 ప్రకారం ప్రతి గ్రామ సొసైటీకి 5ఎకరాల భూమి కేటాయించాలి. 50సంవత్సరాలు దాటిన గోవులు, గొర్రెల కాపరులకు రూ.3వేల పెన్షన్ ఇవ్వాలి.
రాజధానిలో యాదవ సంఘ భవనాన్ని నిర్మించాలి. పాల డెయిరీ చైర్మన్ పదవులు యాదవులకు కేటాయించాలి. యాదవ కార్పొరేషన్ కు నిధులు విడుదల చేయాలి. ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రెల కాపరులకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. అడవులపై యాదవులకు హక్కు కల్పించాలి. యాదవ కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలి. జనాభా ప్రాతిపదికన యాదవులకు నామినేటెడ్ పదవులు కేటాయించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. యాదవులకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చిన పార్టీ తెలుగుదేశం. గత ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆర్థికమంత్రి, టిటిడి బోర్డు చైర్మన్ పదవులను యాదవులకు కేటాయించాం. జనాభా ప్రాతిపదికన యాదవ కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తాం. గోవులు, గొర్రెల కాపరులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం. జనాభాను బట్టి నియోజకవర్గ కేంద్రాల్లో యాదవ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తాం అని వారికి హామీ ఇచ్చారు.