టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం మంత్రాలయం నియోజకవర్గం బాపులదొడ్డి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో, నీళ్లు సరిగా రావడం లేదు. గ్రామంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. డ్రైనేజిలను శుభ్రం చేయడం లేదు. రేషన్ బళ్ల ద్వారా బియ్యం పంపిణీ సక్రమంగా జరగడం లేదు. వాడకపోయినా కరెంటు బిల్లులు భారీగా వేస్తున్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి అని వారు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ తాగునీటి కుళాయిలు అందించాలని రూ.22వేల కోట్లతో ఎన్టీఆర్ జలసిరి పథకానికి శ్రీకారం చుడితే, వైసిపి ప్రభుత్వం వచ్చాక దానిని నిర్వీర్యం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించాం. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఎక్కడా తట్ట మట్టివేసిన పాపాన పోలేదు. .వైసిపి ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో 8సార్లు కరెంటు బిల్లులు పెంచి ప్రజల నడ్డి విరిచారు అని విమర్శించారు.