టిడిపి అధికారంలోకి రాగానే రజక సంక్షేమానికి నిధులు కేటాయిస్తాం, చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం ధర్మవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజకసంఘం, టిడిపి రజక సాధికార సమితి ప్రతినిధులు లోకేష్ ను కలిసి సమస్యలపై విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ బిసిల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి బిసిల వెన్నువిరుస్తున్నారన్నారు.
గత నాలుగేళ్లలో బిసిలకు చెందాల్సిన రూ. 75వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన బిసి ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. బిసిలపై 26వేలకుపైగా తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామని వెల్లడించారు. రజకులు వృత్తిపనిచేసుకునేందుకు వాషింగ్ మిషన్లను అందజేసి, 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. మీ అందరి సంక్షేమం కోసం కృషిచేసే చంద్రన్నను సిఎం చేసేందుకు మీవంతు సహకారం అందించాలని లోకేష్ వారికి విజ్ఞప్తి చేశారు.