టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం మైదుకూరు మున్సిపల్ ఆఫీసు వద్ద పట్టణ ప్రముఖులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
పట్టణంలోని 15వవార్డుతోపాటు వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వీధిలైట్లు లేకపోవడంతో చీకటిలోనే ప్రజలు బిక్కుబిక్కుమంటూ నడవాల్సి వస్తోంది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే నాథుడు లేడు. డ్రైనేజీ పూడిక తీయకపోవడంతో మురుగునీరు, దుర్గంధం మధ్య నడవాల్సిన పరిస్థితి. మున్సిపాలిటీ నిధులను అధికార పార్టీ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారు.
సరిగా మంచినీరు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మైదుకూరు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైసిపి చేతగానిపాలన కారణంగా వివిధ మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేవు.
అభివృద్ధి చేతగాని జగన్ వివిధరకాల పన్నులతో ప్రజల నడ్డివిరుస్తున్నారు. గత టిడిపి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 30లక్షల ఎల్ఇడి లైట్లు ఏర్పాటు చేశాం. డ్రైనేజీలు, వీధిలైట్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి, పట్టణాలను తీర్చిదిద్దుతాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.