టిడిపి అధికారంలోకి రాగానే సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం నందికొట్కూరు నియోజకవర్గం కోనేటమ్మపల్లి క్రాస్ వద్ద మండలంలోని సర్పంచులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
గత ప్రభుత్వంలో మంజూరు చేసిన హంద్రీనీవా సుజల స్రవంతి పనులు వైసిపి ప్రభుత్వం వచ్చాక నిలిపివేసింది.
హంద్రీనీవా నది కాలువల పనులు పూర్తయితే మా ప్రాంతంలో 80శాతం భూములు సాగులోకి వస్తాయి.
సర్పంచులు గ్రామాల్లో చేసిన పనుల బిల్లులను ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్ లో పెట్టింది.
ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్లకు వైసీపీ ప్రభుత్వం పాడుబెడుతోంది.
గ్రామాల్లో నెల రోజులుగా మంచినీరు రావడం లేదన్నా పట్టించుకునేవారు లేరు.
మా గ్రామాలకు ఇరువైపుల కెసి కెనాల్, కృష్ణానది బ్యాక్ వాటర్ ఉన్నాయి.
వీటిపై ఆధారపడిన మత్స్యకారులకోసం కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలి.
హంద్రీనీవా నుండి మా గ్రామంలోని దామగట్ల చెరువుకు నీరు పంపాలి.
మా చుట్టుప్రక్కల గ్రామాల నుండి హైదరాబాద్ కు, ప్రముఖ పుణ్యక్షేత్రం అలంపూర్ కు వెళ్లేందుకు కోనేటమ్మపల్లె నుండి అలంపూర్ బ్రిడ్జి వరకు 4కి.మీ. రోడ్డు నిర్మించాలి.
నందికొట్కూరు రోడ్డు నుండి వడ్డెమాను గ్రామానికి పొలాల మధ్యలో రోడ్డు వేస్తే మా వడ్డెమాను గ్రామానికి 5కి.మీ. దూరం తగ్గుతుంది అనివారు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.
వారి వినతులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
వైసిపి ప్రభుత్వం పంచాయతీలు, సర్పంచులకు శాపంగా మారింది.
గ్రామ పంచాయతీలను విధులు, నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు.
పంచాయతీలకు చెందిన రూ.8,600కోట్లను జగన్ ప్రభుత్వం దొంగిలించింది.
అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సర్పంచులకు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ప్రకాశంజిల్లాలో వైసిపికి చెందిన ధనలక్ష్మి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చాక హంద్రీనీవా సుజల స్రవంతి పథకం పనులను పూర్తిచేస్తాం.
వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి, ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్లను పునరుద్ధరిస్తాం.
నందికొట్కూరు రోడ్డు నుండి వడ్డెమాను గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపడతామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.