టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ యువకులకు ఉద్యోగాలు తేవడం మాత్రమే కాకుండా బిసి యువత ను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం శింగనమల నియోజకవర్గం సలకంచెరువు గ్రామంలో బీసీ సామాజికవర్గ ప్రతినిధులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. బీసీ సంఘాల ప్రతినిధులు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామని చెప్పారు. బిసిలు ప్రతి ఆరు నెలలకోసారి బిసిలమని రుజువు చేసుకోవడానికి కుల ధృవీకరణ పత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి ఉంది,మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ప్రభుత్వమే మీ ఇంటికి శాశ్వత బిసి కుల ధృవీకరణ పత్రాలు అందజేసే ఏర్పాటు చేస్తామని తెలిపారు.
బిసి పిల్లలు ఉన్నత చదువులు చదవకూడదు అనే ఉద్దేశంతో జగన్ అన్ని పథకాలు రద్దు చేశాడని విమర్శించారు. టిడిపి హయాంలో బీసీ స్టడీ సర్కిల్స్, పీజీ ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య పథకాలు తెచ్చామన్నారు. టిడిపి హయంలోనే బిసి కాలనీలను అభివృద్ది చేసాం. వైసిపి ప్రభుత్వం బిసి కాలనీలను పట్టించుకోలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన మౌలిక వసతులు, ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందిస్తాం. బీసీ భవనాలు కూడా ప్రతి నియోజకవర్గంలో నిర్మిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. సీడ్ కార్పొరేషన్ ద్వారా గాండ్ల కులస్థులకు సబ్సిడీ లో గింజలు అందిస్తాం. గానుగ ఆడుకోవడానికి సహాయం చేస్తామని చెప్పారు.
జగన్ పాలనలో రజకులకి తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. టిడిపి హయాంలో దోబి ఘాట్స్ నిర్మించాం, రజకులకి వాషింగ్ మెషిన్, ఐరెన్ బాక్సులు ఇచ్చామని వివరించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాషింగ్ మెషిన్ తో పాటు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, ఐరెన్ బాక్సులు, ఐరెన్ చేసుకునే బండ్లు ఇస్తామని చెప్పారు. బోయ లను ఆదుకుంది టిడిపి. వైసిపి పాలనలో బోయలకి అన్యాయం జరిగింది. గతంలోనే మేము తీర్మానం చేసాం. నాలుగేళ్లు పడుకొని జగన్ ఇప్పుడు మళ్లీ తీర్మానం అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారు. మీరు ఏ వృత్తి ఎంచుకున్నా టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే సబ్సిడీ రుణాలు అందిస్తాం. స్వయం ఉపాధికి సాయం అందిస్తామని వెల్లడించారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేశారు. అందుకే ప్రతి రోజూ ఫుడ్ పాయిజన్ వార్తలు వింటున్నాం.
టిడిపి హయాంలో పౌష్ఠిక ఆహారం పిల్లలకి అందించాం. మెరుగైన వసతులు కల్పించాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సంక్షేమ హాస్టల్స్ లో మెరుగైన వసతులు కల్పిస్తాం అని వివరించారు. వైసిపి పాలనలో మట్టి మాఫియా రెచ్చిపోతుందని లోకేష్ ఆరోపించారు. అనంతపురం కి కియా లాంటి అనేక పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చింది టిడిపి. కానీ ప్రజలు పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారని విమర్శించారు. కుమ్మరి కులస్తులను ఆదుకుంటాం. మారుతున్న కాలానికి తగ్గట్టుగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమంపై దృష్టి పెడతాం. మట్టి, బట్టి కోసం భూములు కేటాయిస్తామని చెప్పారు.
బీసీలకు అన్యాయం
వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం తలపెట్టిందని లోకేష్ విమర్శించారు. టిడిపి హయాంలో బీసీ సంక్షేమానికి కట్టుబడి వున్నదని చెప్పారు. టిడిపి హయాంలో బిసిలను రాజకీయంగా, ఆర్థికంగా ప్రోత్సహించామన్నారు. టిడిపి హయాంలో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను జగన్ 10 శాతం తగ్గించి బిసిలు కోలుకోలేని దెబ్బ కొట్టారని పేర్కొన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం ఉపకులాలకు నిధులు, రుణాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్ర లో పాల్గొన్న 16మంది బీసీ సోదరులపై శింగనమల ఎమ్మెల్యే భర్త అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26
వేల మంది బిసిల పై కేసులు పెట్టారన్నారు. అందుకే బీసి రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.