టిడిపి అధికారంలోకి రాగానే పంట పెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం కమలాపురం నియోజకవర్గం ఉప్పరపల్లి క్రాస్ వద్ద వీరపునాయనిపల్లె మండల రైతులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
మా మండలంలో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గులాబీ తెగులు వల్ల పత్తిపంట దెబ్బతింది. ఎకరానికి క్వింటా పత్తి కూడా దిగుబడి రాలేదు. పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. అప్పులు తీర్చలేక రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. టీడీపీ పాలనలో ఫసల్ బీమా కింద రైతులే స్వయంగా ప్రీమియం కట్టేవారు. ఇన్సూరెన్స్ వచ్చేది. వైసీపీ పాలనలో ఎలాంటి ఇన్సూరెన్స్ రావడం లేదు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే కనీసం పట్టించుకున్నవారు లేరు. మీరు అధికారంలోకి వచ్చాక పంటల బీమా అందించి రైతులను ఆదుకోవాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా వైసిపి ప్రభుత్వం నకిలీ విత్తనాల మాఫియాను జగన్ పెంచిపోషిస్తున్నారు. కల్తీవిత్తనాల కారణంగా పంట దిగుబడులు
తీవ్రంగా దెబ్బతిని రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. దేశం మొత్తం ఎపిరైతులు అప్పుల్లో మొదటిస్థానంలో ఉండగా, ఆత్మహత్యల్లో 3వస్థానంలో ఉన్నారు. పంటల బీమాను ప్రభుత్వమే కడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి రైతులను దారుణంగా మోసగించారు. అన్నదాతల కష్టాలు గమనించాక చంద్రబాబునాయుడు మహనాడులో అన్నదాత పథకాన్ని ప్రకటించారు, అధికారంలోకి వచ్చాక ఏటా రూ.20వేల రూపాయల సాయం అందిస్తాం. నకిలీవిత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. రైతులకు గతంలో అందించిన డ్రిప్ సబ్సిడీ, ఇతర పథకాలను తిరిగి పునరుద్దరిస్తాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.