టిడిపి అధికారంలోకి రాగానే మైనారిటీల ఆస్తులకు రక్షణ కల్పించడంతోపాటు మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం కానాల గ్రామ ముస్లిం మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామానికి 2018లో టిడిపి హయాంలో షాదీఖానాకు రూ.50లక్షలు మంజూరు చేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నిధులను నిలిపేసింది. మీరు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ నిధులను విడుదల చేయాలి. మా గ్రామంలోని జామియా మసీదు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది. అందులో సామాన్లు కూడా కాలిపోయాయి. మసీదు కూడా పాక్షికంగా దెబ్బతింది. మసీదు పునర్నిర్మాణంతోపాటు, అందులో సామాన్లు కొనుగోలుకు నిధులు మంజూరు చేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనారిటీలపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది.
మైనారిటీల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దుల్హాన్, రంజాన్, విదేశీ విద్య వంటి పథకాలను రద్దుచేసింది. మైనారిటీల కోసం ఖర్చుచేయాల్సిన రూ.5,400 కోట్ల సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించింది. రాష్ట్రవ్యాప్తంగా వేలకోట్ల వక్ఫ్ బోర్డు ఆస్తులను వైసిపి నేతలు కబ్జా చేశారు. గత ప్రభుత్వంలో మైనారిటీల కోసం అమలుచేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.