టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక పాలసీని సరళతరం చేసి అందుబాటులోకి తెస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా
బుధవారం నందికొట్కూరులో తాపీ వర్కర్స్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇసుక దొరక్క, మాకు ఉపాధి కరువైంది.నాలుగేళ్లుగా పనుల్లేక మా కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి.
మా పిల్లలకు స్కూలు ఫీజులు కట్టే పరిస్థితులు లేక ఇబ్బందులు పడుతున్నాం.
గత ప్రభుత్వంలో 20 మందికి ఉపాధి కల్పించిన తాపీ మేస్త్రి నేడు వేరొకరి కింద పనిచేయాల్సివస్తోంది.
వైసీపీ ప్రభుత్వం సృష్టించిన ఇసుక కొరతతో నిర్మాణం రంగం, దాని అనుబంధ రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి.
మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో ఇసుక అంతటినీ బినామీ పేరుతో జగన్ అండ్ కో హస్తగతం చేసుకుంది.
జిల్లాకొక సామంతరాజును నియమించుకొని రాష్ట్రప్రజలకు ఇసుక దొరకనీయకుండా పొరుగురాష్ట్రాలకు తరలించేస్తున్నారు.
గత నాలుగేళ్లలో ఇసుక ద్వారా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రూ.10వేలకోట్లు దోచుకున్నారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమనిధిలోని రూ.2వేల కోట్లను జగన్ దొంగిలించారు.
జగన్ రెడ్డి నిర్వాకం కారణంగా 40లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు.
నిర్మాణరంగానికి గత వైభవం చేకూర్చి కార్మికులకు చేతినిండా పనికల్పిస్తాం.
భవన నిర్మాణ సంక్షేమ నిధిని పునరుద్దరించి, కార్మికులను ఆదుకుంటామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.