టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్డగోలు పన్నుల విధానాన్ని సమీక్షించి, అనవసరమైన పన్నులు తొలగిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం కడప నగరం శంకరాపురం వాసులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
మా డివిజన్ లో యూజీడీ పనులు 16ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో అన్ని సందుల్లో మురుగునీరు పారుతోంది. సీసీరోడ్లు పూర్తిస్థాయిలో నిర్మించలేదు. డివిజన్ లో తరచుగా కరెంటు కోతలున్నాయి. కాలంతో సంబంధం లేకుండా మంచినీరు రెండు రోజులకు ఒకసారి వస్తున్నాయి. వీధిలైట్ల నిర్వహణ సరిగా లేదు. మా డివిజన్ లో మురుగునీటి వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి అనివారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ధ సౌకర్యాల కల్పనపైలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థలన్నీ నిర్వీర్యంగా మారాయి. కడపవంటి ప్రముఖ నగరాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా కార్పొరేషన్ వద్ద నిధుల్లేవు. టిడిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 25వేల కి.మీ. సిసి రోడ్లు, 30లక్షల ఎల్ ఇడి లైట్లు వేశాం. మళ్లీ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కడప నగరంలో సిసి రోడ్లు, మెరుగైన డ్రైనేజి వ్యవస్థ, ఎల్ ఇడి వీధిదీపాలు ఏర్పాటు చేస్తాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందజేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.