టిడిపి అధికారంలోకి రాగానే వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం ధర్మావరం నియోజకవర్గం ముష్టూరు లో ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు లోకేష్ ను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలు విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అసమర్థ, చేతగాని విధానాలతో అన్నదాతలకు మరణశాసనం రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చాక రైతు ఆత్మహత్యల్లో దేశం మొత్తమ్మీద రాష్ట్రం 3వస్థానంలో ఉందన్నారు. మళ్లీ ఇప్పుడు మోటార్లకు మీటర్ల పేరుతో రైతాంగం మెడకు ఉరితాడు బిగించాలని చూస్తున్నాడని చెప్పారు. గతంలో రైతులపై రూ.70వేలు ఉన్న సగటు అప్పు, వైసిపి ప్రభుత్వం నిర్వాకం కారణంగా రూ.2.5లక్షలకు పెరిగి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి ఉండగా రాయలసీమ రైతులకు 90శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందజేసినట్టు చెప్పారు. రైతులకు రుణమాఫీ అమలుచేయడమేగాక రాయితీపై యంత్రపరికరాలు, ఎరువులు, పురుగుమందులు అందజేశామన్నారు. రైతుల సంక్షేమాన్ని కాంక్షించే చంద్రన్నను సిఎం చేసేందుకు మీ వంతు సహకారం అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.