జిఓ.01 రద్దు జగన్ కు చెంపపట్టు.. చెల్లదని జిఓ ఇచ్చినరోజే చెప్పా
ఎపి చరిత్రలో తొలిసారిగా జగన్ పాలనలో దళితుల భూమి తగ్గింది
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంబేద్కర్ విదేశీవిద్య పునఃప్రారంభిస్తాం
జగన్ రద్దుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్దరిస్తాం
ఎస్సీ లతో లోకేష్ ముఖాముఖి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ముందు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఓడింది. జీఓ-01 రద్దు జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు లాంటిది అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
పేర్కొన్నారు. జీఓ ఇచ్చిన రోజే ఇది చెల్లదు అని జగన్ కు నేను చెప్పాను. నేడు అదే జరిగిందని అన్నారు.
యువగళం పాదయాత్ర సందర్భంగా శుక్రవారం నందికొట్కూరు నియోజకవర్గం, పాములపాడులో ఎస్సీ లతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. సమావేశంలో యువనేత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దళితులకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేశాడు. అంబేద్కర్ పేరును విదేశీవిద్య పథకానికి చంద్రబాబు పెడితే, జగన్ దానిని తీసేసి తన పేరు పెట్టుకున్నాడు. మేం అధికారంలోకి వచ్చాక దళితులకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించి, ఖర్చు చేస్తామని చెప్పారు.
ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన దొంగ లెక్కలు బాగా రాస్తాడు. నిధులు కేటాయిస్తాడే తప్ప, ఖర్చు చేయడు. టీడీపీ పరిపాలనలో దళితులకు ఖరీదైన వాహనాలు కొని స్వయం ఉపాధి కల్పించాం. దళిత
సంక్షేమానికి రూ.40వేల కోట్లు ఖర్చు చేశాం. 3వేల ఎకరాలు కొనుగోలు చేసి దళితులకు ఇచ్చాం. దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం. విదేశీవిద్య పథకాన్ని అమలు చేసి విదేశాల్లో చదివించాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నింటినీ రద్దు చేశాడు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా చంద్రబాబు అమలు చేశారని లోకేష్ వివరించారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం మళ్లీ తెస్తాం
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యనందించడానికి బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ పథకం తెచ్చాం. దానిని జగన్ రద్దు చేశాడు. మేం అధికారంలోకి వచ్చాక ఈ పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామని లోకేష్
వెల్లడించారు. 2014లో రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ లోనూ రాష్ట్రంలో సంక్షేమాన్నిఅందించిన వ్యక్తి చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో యువతకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. 2025
జనవరిలో మేం మెగా డీఎస్సీ ప్రకటిస్తాం. 5ఏళ్లలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తాం.
రాయలసీమ ముద్దు బిడ్డనని చెప్పుకుంటున్న జగన్ ఈ రాయలసీమ కోసం ఏం చేశాడు? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో 2.70లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాం. ఈసారి 5లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం. చంద్రబాబు పాలనలో ఏనాడూ విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. జగన్ వచ్చాక ఇప్పటికి 8సార్లు పెంచారు. మీరు కాల్చే ప్రతి యూనిట్ లో జగన్మోహన్ రెడ్డి రూ.1 లంచంగా తీసుకుంటున్నాడు. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలను సమీక్షిస్తాం. దళితులకు 200యూనిట్లు విద్యుత్ ను ఉచితంగా అందిస్తాం.
జగన్మోహన్ రెడ్డి వివిధ కారణాలతో కట్ చేసిన పెన్షన్లను మళ్లీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. చంద్రబాబు పాలనకు ముందు ఉన్న ఏ పథకాన్ని మేం రద్దు చేయలేదు. జగన్మోహన్
రెడ్డి సీఎం అయ్యాక చంద్రబాబు పాలనలో అమలైన పథకాలన్నీ రద్దు చేశాడు. కులం, మతం, ప్రాంతాల ప్రకారం ప్రజలను విడదీస్తోంది. మీ వివరాలు ఇవ్వండి. మీ పిల్లలను చదివించే బాధ్యతను మేం తీసుకుంటాం. మేం అధికారంలోకి వచ్చాక శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకుంటాం. జీఓ98 ను అమలు చేస్తాం. ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఇన్సూరెన్సు భారాన్ని తగ్గిస్తాం. అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక పోలీసులను ఫోటోగ్రాఫర్లుగా మార్చారు. వాళ్లకు టార్గెట్లు పెట్టి చలానాలు వేస్తున్నారు అని లోకేష్ ఆరోపించారు.
ఎస్సీ సంక్షేమంపై చర్చకు సిద్ధం
ఎస్సీ వర్గీకరణ విధానం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. కర్ణాటక లో ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేశారు. చంద్రబాబు పాలనలో జి.ఓ 25 తెచ్చి దళిత సంక్షేమ పథకాలను ఉపకులాలకు అమలు చేశారు. 2014-19 మధ్య దళితులకు మేం ఏం చేశామో, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చర్చించడానికి మేం సిద్ధం అని లోకేష్ సవాల్ చేశారు. సాంఘిక సంక్షేమమంత్రి బహిరంగచర్చకు రావాలి. అసైన్డ్ ల్యాండ్ చట్టంపై రాష్ట్రంలో ఇంకా సందిగ్ధత నెలకొంది. కర్నాటకలో చట్టాన్ని అధ్యయనం చేసి త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటాం. బెస్ట్ అవెయిలబుల్ స్కూల్ స్కీం, ఫీజు రీయింబర్స్ మెంట్, పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశీవిద్య పథకాలను చంద్రబాబు అమలు చేశారు.
జగన్ వీటిని రద్దు చేశాడు. మేం అధికారంలోకి వచ్చాక దళిత యువతకు స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాం. అధికారంలోకి వచ్చాక కేజీ టు పీజీ కాలేజీ సిలబస్ లో మార్పులు చేస్తాం. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్యతతో కూడిన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ చరిత్రలో వైసీపీ పాలనలోనే దళితుల చేతిలో భూమి తగ్గింది. మేం అధికారంలోకి వచ్చాక భూమి కొనుగోలు పథకాన్ని కొనసాగిస్తాం. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే గ్రామాల్లో ఉన్న అంతర్గత రోడ్లను నిర్మిస్తాం. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మాట కనీసం వలంటీర్లే వినడం లేదు. జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి దళితులను వైసీపీ నాయకులు చంపి డోర్ డెలివరీ చేస్తున్నారు.
దళిత హంతకులకు వైసీపీ నాయకులు పాలాభిషేకాలు చేసి సన్మానిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు. డాక్టర్ సుధాకర్ తో మొదలై డాక్టర్ అచ్చెన్న వరకు దళితులపై వైసీపీ మారణకాండ, వేధింపుల పర్వం కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దళిత రైతుల చేతికి బేడీలు వేసి జైళ్లకు పంపారు. దళితులకు జరిగిన అన్యాయంపై నేను మాట్లాడినందుకే నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. నాపై 20కేసులు పెట్టారు. ఈ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపి మీ కోసం పనిచేసే చంద్రన్నను ముఖ్యమంత్రిని చేయండి అని కోరారు.
ఎస్సీలతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:
శివప్రసాద్: దళితులకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించడం లేదు. మీరు వచ్చాక మాకు న్యాయం చేయండి.తిరుమలయ్య: 2019లో బీఈడీ పూర్తిచేశాను. మెగా డీఎస్సీ ఇస్తానని జగన్ చెప్పాడు, నేటికీ ఇవ్వడం లేదు. మీరు వచ్చాక డీఎస్సీ ఇవ్వండి. ప్రైవేటు పాఠశాలల్లో దళిత విద్యార్థులకు ఉచిత విద్య అందించండి.
ఏసోబు: గత ప్రభుత్వంలో మీటరుకు రూ.250 కడితే విద్యుత్ మీటర్ వచ్చేది. నేడు రూ.2వేలు పైబడి కట్టాల్సివస్తోంది. కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోంది. మీరు వచ్చాక కరెంటు బిల్లులు తగ్గించండి.
రమేష్: నా భార్య చనిపోయి 3సంవత్సరాలు అయ్యింది. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదు. నాకు ఇద్దరు పిల్లలు. మీరు మా కుటుంబాన్ని ఆదుకోవాలి.
రవి కుమార్: జీఓ-98 ప్రకారం గత ప్రభుత్వం శ్రీశైలం ముంపుప్రాంతం ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏ ఉద్యగమూ ఇవ్వలేదు. మీరు వచ్చాక ఆదుకోండి.
నవీన్: నేను ఆటో డ్రైవర్ ను. మాకు డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. రోడ్డు ట్యాక్సులు పెరిగాయి. రోడ్డు పక్కన బండి ఎక్కడ ఆపినా పోలీసులు చలానాలు వేస్తున్నారు. మీరు వచ్చాక ఈ బాదుడు
లేకుండా చూడండి.
స్వామి: మా ఎస్సీ కాలనీకి గత 20ఏళ్లుగా సరైన రోడ్డు లేదు. పంట ఇంటికి చేరాలంటే బస్తాకు రూ.40ఇవ్వాల్సివస్తోంది. మీరు వచ్చాక మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి.