- కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ భరోసా
- సమస్యల పరిష్కారానికి యువనేత చొరవ
- 18వ రోజు ‘ప్రజాదర్బార్’ కు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు
అమరావతి(చైతన్యరథం): కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ‘ప్రజాదర్బార్’ కు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే ఉండవల్లిలోని నివాసంలో నారా లోకేష్ నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’ 18వ రోజు గురువారం జనం భారీగా తరలివచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరిని కలిసిన మంత్రి.. వారి నుంచి విన్నపాలు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని భరోసా ఇచ్చారు.
నందిగం సురేష్ టిప్పర్ లారీ నా మనవడిని బలితీసుకుంది
మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు చెందిన టిప్పర్ లారీ ఢీకొని నాలుగేళ్ల తన మనవడు దుర్మరణం పాలయ్యాడని, తగిన న్యాయం చేయాలని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లికి చెందిన తాళ్ల నాగరాజు.. మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. పాఠశాల నుంచి తన మనవడిని ద్విచక్రవాహనంపై తీసుకువస్తుండగా ఉండవల్లి సెంటర్ వద్ద టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని, ప్రమాదంలో తన కాలు విరిగిందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నందిగం సురేష్ పేరు చెప్పి డ్రైవర్ బెదిరించాడని వాపోయారు. విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను విన్న లోకేష్.. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
తప్పుడు దస్తావేజులతో స్థలాన్ని విక్రయించారు
తప్పుడు దస్తావేజులతో తమ నివాస స్థలాన్ని విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లికి చెందిన భవనాశి రాజరాజేశ్వరి.. నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దుగ్గిరాల మండలం శృంగారపురంలో మట్టి రోడ్ల కారణంగా ఇబ్బందులు పడుతున్నామని, వర్షాకాలంలో మరీ అధ్వానంగా మారాయని, సీసీ రోడ్లు నిర్మించాలని గ్రామ సర్పంచ్ యలవర్తి అంకమయ్య కోరారు. పుట్టకతోటే రెండు కిడ్నీలు పాడైపోయిన తమ కుమారుడికి వైద్యం సాయం అందించి ఆదుకోవాలని మంగళగిరి పట్టణానికి చెందిన తాళ్లూరి శిరీష విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన తనకు వికలాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని సీతానగరానికి చెందిన ఎన్.సూరిబాబు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన 8 నెలల కుమారుడికి వైద్యం సాయం చేయాలని తాడేపల్లికి చెందిన పఠాన్ అల్లాబీ విజ్ఞప్తి చేశారు. ఏపీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్న తనకు పిల్లల చదువు భారంగా మారిందని, రేషన్ కార్డు మంజూరు చేయాలని కృష్ణా జిల్లా బాపులపాడుకు చెందిన వి.విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పెదకాకాని మండలం నంబూరులో తమ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయవాడకు చెందిన ఎస్.నరేంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు.