యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం హోరెత్తింది. కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నడుమ 154వరోజు పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. చోడవరం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా, అడుగడుగునా మహిళలు, యువకులు యువనేతకు అపూర్వస్వాగతం పలికారు. కొమ్మి గ్రామంలో మహిళలు పసుపుచీరలను ధరించి యువనేతపై పూలు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
పాదయాత్ర దారిలో కొమ్మిలో యువనేత లోకేష్ ఎలిమెంటరీ స్కూలును సందర్శించారు. స్కూలు పిల్లలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించిన లోకేష్, స్కూలులో సౌకర్యాలపై ఆరా తీశారు. మంచిగా చదువుకొని తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని చిన్నారులకు చెప్పి, అక్కడ నుంచి బయలుదేరారు. భోజన విరామానంతరం సాయంత్రం కొండాపురం జరిగిన బహిరంగసభకు జనం పోటెత్తారు. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.
154వ రోజున యువనేత లోకేష్ 19.5 కి.మీ.ల దూరం పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2039.4 కి.మీ. మేర పూర్తయింది. కోర్టు కేసుల నిమిత్తం మంగళగిరి వెళ్లాల్సి ఉన్నందున 13,14 తేదీల్లో యువగళానికి విరామం ప్రకటించారు. 155వరోజు పాదయాత్ర ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం నుంచి యథావిధిగా ప్రారంభమవుతుంది.