తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో మాదిరిగా డ్వాక్రా సంఘాల ద్వారా ప్రతి గింజ కొనుగోలు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం శ్రీశైలం నియోజకవర్గం మోతుకూరు గ్రామంలో కళ్లంలో ఆరబోసిన ధాన్యం కుప్పను యువనేత లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా రైతు లక్ష్మీదేవి మాట్లాడుతూ మా గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఉన్నా ఉపయోగంలేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటా రూ.1940కి కొనకపోవడంతో, మిల్లర్లకు రూ.1500కి అమ్ముకుంటున్నాం.
ఎకరంలో వరిపంట వేశాను, కూలీఖర్చులు, పెట్టుబడులన్నీ పెరిగిపోయాయి. ఇలాగైతే మాకు ఎటువంటి లాభంలేదు అని లోకేష్ ఎదుట వాపోయారు. అందుకు లోకేష్ సానుకూలంగా స్పందించారు. ధాన్యం మొత్తాన్ని కొంటానన్న జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో తొంగొని రైతులను గాలికొదిలేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని అడిగిన రైతులను పౌరసరఫరాల మంత్రి ఎర్రిపప్పలని దూషిస్తున్నాడు. మరో ఏడాది ఓపిక పడితే ఎర్రిపప్పలు ఎవరో ప్రజలే తేలుస్తారు. పంటపెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు.