టిడిపి అధికారంలోకి వచ్చాక పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపి, పొద్దుటూరు, పరిసర గ్రామాల ప్రజల తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం ప్రొద్దుటూరు నియోజకవర్గం పెద్దశెట్టిపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్నసమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
మా గ్రామానికి సరిహద్దులో పెన్నా నది ఉంది. అధికార పార్టీ నాయకులు పెన్నా నదిలో ఇసుకను అడ్డగోలుగా తవ్వి పక్క రాష్ట్రాల్లో అమ్ముకుంటున్నారు. పెన్నా నది నీళ్లపై ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, రాజుపాలెం మండలంలోని 5 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. ఇసుక అధికంగా తవ్వడం వల్ల నీరు పూర్తిగా ఇంకిపోయే ప్రమాదం పొంచి ఉంది. రైతులు వ్యవసాయ భూమికి ఇసుకను తీసుకెళితే పోలీసులు కేసులు పెట్టి హింసిస్తున్నారు. రోజుకి వందల సంఖ్యలో వెళ్లే లారీలను మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలి అని వారు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో ఇసుక మొత్తాన్ని జగన్ అండ్ కో పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ అడ్డగోలు దోపిడీకి తెరలేపారు. గత నాలుగేళ్లలో ముఖ్యమంత్రి జగన్ ఇసుకపై రూ.10వేల కోట్లు దోచుకున్నారు. జగన్ రెడ్డి ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61మంది అమాయకులు బలయ్యారు. ఇసుక పాలసీని సరళతరం చేసి స్థానికంగా ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తెస్తాం. పెన్నానది నుంచి రైతుల పొలాలకు అవసరమైన ఇసుకను ఉచితంగా తోలుకునే అవకాశం కల్పిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.