- ఊహించన సీట్ల కన్నా ఎక్కువే: మోదీ
- ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంటాయి: పవన్
- ప్రధానికి కృతజ్ఞతలు: చంద్రబాబు
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన రోడ్ షోలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులతో బెజవాడ జనసంద్రంగా మారింది. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ అగ్రనేతలు ముందుకు సాగారు. ఎన్టీయే కూటమికి మద్దతుగా రాజధాని రైతులు, మహిళలు బెంజిసర్కిల్ వద్దకు భారీగా తరలివచ్చారు.
ఏపీలో ఊహించిన సీట్ల కన్నా ఎక్కువే: ప్రధాని మోదీ
ఏపీలో కూటమి జోష్ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్ షో విజయవంతమైందన్నారు. రోడ్ షో ముగిసిన తర్వాత మోడీ, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారం, తాజా పరిస్థితులపై చర్చించారు. తనకు అందిన నివేదికల మేరకు కూటమిదే అధికారమని మోదీ వారితో చెప్పినట్లు తెలుస్తోంది. ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లే వస్తాయని, జగన్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి. భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి మోదీ దిల్లీ బయల్దేరి వెళ్లారు.
సరికొత్త చరిత్ర: చంద్రబాబు
విజయవాడలో ప్రధాని మోదీ, జనసేనాని పవన్ కల్యాణ్‌తో కలిసి నిర్వహించిన రోడ్ షో సరికొత్త చరిత్ర సృష్టించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రోడ్ షోలో పాల్గొన్న అభిమానులు, కార్యకర్తలకు ఎక్స్ (ట్విటర్) వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. భారీ ప్రజా స్పందన ఎంతో థ్రిల్ కలిగించిందన్నారు. మూడు పార్టీల అధినేతలకు లభించిన ప్రజాభిమానం ఎన్నికల ఫలితాలు ఆశాజనక వాతావరణానికి నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4న కొత్త ప్రభుత్వం నెలకొల్పుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: పవన్
విజయవాడలో ప్రధాని రోడ్ షో విజయవంతం కావడం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. మోదీ తలపెట్టిన వికసిత్ భారత్ కోసం తాము నిర్విరామంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రధానితో కలిసి ఏపీలో పాల్గొన్న ఎన్నికల ప్రచారం ఎంతో విలువైందన్నారు. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.