- ‘ప్రజాదర్బార్’కు పోటెత్తిన జనం
- విదేశీవిద్య సాయం అందించండి
- వైసీపీ నేతలు భూములు కబ్జా చేశారు
- ఆటో కార్మికుల కోసం ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటుచేయాలి
- మంత్రి నారా లోకేష్‌కు వినతుల వెల్లువ
- పలు సమస్యలపై తక్షణ పరిష్కారానికి సిబ్బందికి లోకేష్ ఆదేశాలు
అమరావతి(చైతన్యరథం): కష్టాల్లో ఉన్నామంటే చాలు.. క్షణం ఆలోచించకుండా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. ఉండవల్లిలోని నివాసంలో సోమవారం 24వ రోజు ‘ప్రజా దర్బార్’కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి, తమ సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తుల తక్షణ పరిష్కారానికి సిబ్బందికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో తమ కష్టాలు విన్నవించుకునేందుకు ‘ప్రజాదర్బార్’ కు వచ్చిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆటో కార్మికుల కోసం..
ఆటో కార్మికుల సంక్షేమం కోసం మంగళగిరిలో ఎంఎస్‌ఎంఈ ఆటో పార్క్ ఏర్పాటుచేయాలని మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు.. మంత్రి నారా లోకేష్‌ను కలిసి కోరారు. మంచానికే పరిమితమైన తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన పిల్లి శివమ్మ విజ్ఞప్తి చేశారు. భర్త లేని తాను ముగ్గురు పిల్లలతో 26 ఏళ్లుగా అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నానని, ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరుకు చెందిన చింతలచెర్వు మరియమ్మ కోరారు. విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందనే నెపంతో గత ప్రభుత్వం తొలగించిన దివ్యాంగ పెన్షన్ పునరుద్ధరించాలని తాడేపల్లికి చెందిన ఎన్.కేశవరావు విజ్ఞప్తి చేశారు. హత్యకు గురైన తన సోదరుడి డెత్ సర్టిఫికెట్ మంజూరుకు ఆదేశాలు ఇవ్వాలని తాడేపల్లికి చెందిన జి.ప్రసాదరావు కోరారు. ఎంసీఏ చదివిన తనకు ఉద్యోగం కల్పించాలని మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడికి చెందిన జే.మానస విజ్ఞప్తి చేశారు. ఆయా విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
మా భూములు వైసీపీ నేతలు కబ్జా చేశారు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలో జరిగిన భూఅక్రమాలపై విచారణ చేసి సామాన్యులమైన తమకు న్యాయం చేయాలని విశాఖ జిల్లా ఆనందపురం మండలం గొట్టిపల్లికి చెందిన కే.అప్పారావు, కే.శ్రీను, కే.అప్పలరాజు.. నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వంశపారంపర్యంగా తమకు సంక్రమించిన భూములను గత ప్రభుత్వ అండతో వైసీపీ నేతలు కబ్జా చేశారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరిపించి కబ్జాదారులను తరిమికొట్టాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
విదేశీ విద్య పథకం కింద కెనడాలో చదువుతున్న తమ కుమారుడికి ఆర్థికసాయం మంజూరు చేయాలని ఏలూరు జిల్లా బాపిరాజుగూడెంకు చెందిన బి.శ్రీనివాసరావు .. మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
అన్ని అర్హతలు ఉన్న తనకు గత ప్రభుత్వం హోంగార్డు ఉద్యోగం కల్పిస్తామని ఆశ చూపి వంచించిందని, తగిన న్యాయం చేయాలని కాకినాడ జిల్లా సూరంపాలెంకు చెందిన నల్లల మణికంఠ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంకు చెందిన నల్లల త్రిమూర్తులు అనే రైతు.. మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో సేంద్రియ పద్ధతిలో సాగుచేసి, 150 బస్తాలకు పైగా ఉన్న తన ధాన్యపు కుప్ప దగ్ధమై ఆపారనష్టం సంభవించిందని కన్నీటి పర్యంతమయ్యారు. నష్టపరిహారం కోసం గత ప్రభుత్వ హయాంలో అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. తన విజ్ఞప్తిని పరిశీలించి నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
తిరుపతి జిల్లా గూడురు మండలం రెడ్డిగుంటలో తాను కొనుగోలు చేసిన 1.61 ఎకరాలకు పాస్‌బుక్, పట్టా ఇప్పించాలని మెండా రామచంద్రయ్య విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యసేవలు అందించిన తమను 2021 సెప్టెంబర్ లో ఉద్యోగాల నుంచి తొలగించారని, తగిన న్యాయం చేయాలని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన సిబ్బంది.. మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
లివర్, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన భర్తకు మెరుగైన వైద్యం అందేలా సాయం చేయాలని విజయవాడ పోరంకి గ్రామానికి చెందిన షేక్ ఆయేషా.. మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
గత ప్రభుత్వ అండతో ఇంటి స్థలాన్ని కబ్జా చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీ నేత నాదెండ్ల చంద్రమౌళిపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన పెరుమాళ్ల మోహన్ రావు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. నాదెండ్ల చంద్రమౌళి, అతడి తండ్రి నాదెండ్ల సుబ్రహ్మణ్యం రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఎకరాల అసైన్డ్, దేవాలయ భూములు కూడా కాజేశారని ఫిర్యాదు చేశారు. ఇరువురి భూఅక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడికి పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఒంగోలుకు చెందిన బి.వెంకాయమ్మ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు